నేటి నుంచి ఓటరు జాబితా సవరణ.. మీ ఓటుందో లేదో చెక్ చేసుకోండి

తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చడానికి, కొత్త ఓటర్ల నమోదుకు, మార్పులు, చేర్పులకు ఈ రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-08-21 07:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లందరికీ మరోసారి తమ ఓటు హక్కును చెక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారితో పాటు, ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న వాళ్లంతా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఈ రోజు నుంచి కల్పిస్తోంది. అంతే కాకుండా ఓటర్లు తమ చిరునామా మార్చుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ మేరకు ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఈ రోజు (ఆగస్టు 21) ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చడానికి, కొత్త ఓటర్ల నమోదుకు, మార్పులు, చేర్పులకు ఈ రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 26, 27తో పాటు సెప్టెంబర్ 3, 4న గ్రామాలు, వార్డుల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిశీలనను సెప్టెంబర్ 28 కల్లా పూర్తిచేసి.. అక్టోబర్ 4న తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొన్నది. అక్టోబర్ 4న ప్రకటించే తుది జాబితా ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి నమోదు చేసుకునే వారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈసీఐ చెబుతోంది.

ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని కోరుతూ ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు పలు రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. రాబోయే మూడు వారాల పాటు కొత్త ఓటర్లను నమోదు చేయించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

తెలంగాణలో ప్రస్తుతం 3.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.53 కోట్లు, మహిళలు 1.52 కోట్లు... 2,133 మంది ట్రాన్స్ జెండర్లు, 15,368 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని ఓటర్లలో 18-19 ఏళ్ల వయసు వాళ్లు 4.79 లక్షల మంది ఉండగా.. 80 ఏళ్ల కంటే పైబడిన వారు 4.79 లక్షల మంది, దివ్యాంగులు 4.98 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News