కేటీఆర్ పోస్టు కార్డు ఉద్యమానికి అద్భుత స్పందన‌

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. చేనేత పై జీఎస్టీని రద్దు చేయాలంటూ ఆయన ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా ఇప్పటికే వేలాది మంది ప్రధాని మోడీకి పోస్టు కార్డులు రాసి పోస్ట్ చేశారు.

Advertisement
Update:2022-10-24 08:57 IST

చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన పోస్ట్‌కార్డ్ ఉద్యమానికి ఒక్క పద్మశాలీల నుండే కాకుండా అన్ని వర్గాల ప్రజల నుండి ఊహించని స్పందన వస్తోంది.

చేనేత ఉత్పత్తులపై జిఎస్‌టిని రద్దు చేయాలంటూ ప్రధానికి పోస్ట్ కార్డులు రాయాలంటూ కేటీఆర్ పిలుపునిచ్చిన కొద్ది సేపట్లోనే అనేక మంది పోస్ట్ కార్డులు పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక వర్గాల ప్రజలు వేలేది పోస్టు కార్డులు రాసినట్టు సమాచారం. కొందరు తాము రాసిన కార్డులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ ప్రచారానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న తాను స్వయంగా పోస్టు కార్డు రాసి పోస్ట్ చేశారు. చేనేతపై జిఎస్టి రద్దుకోసం తన అన్న చేపట్టిన ఉద్యమానికి ప్రతిఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.


ఇక అనేక మంది నెటిజనులు సోషల్ మీడియాలో వారు రాసిన పోస్ట్ కార్డులను షేర్ చేస్తూ చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు

గోపీకృష్ణ అనే ట్విట్టర్ యూజర్ తాను రాసిన పోస్ట్ కార్డును ట్విట్టర్ లో పోస్ట్ చేసి, "కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై ఐదు శాతం జిఎస్‌టి విధించింది, దీంతో మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగాయి, అందుకే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్‌కార్డ్ పంపుతున్నాము.'' అని కామెంట్ చేశారు.

చేనేత కార్మికుల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కనీస శ్రద్ధ లేదని ఆరోపిస్తూ మరో ట్విట్టర్ యూజర్ శ్రీ హరి పోస్ట్ కార్డు ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. మరో నెటిజన్ జాన్ మనీష్ కూడా తన మద్దతును ట్వీట్ ద్వారా తెలియజేశారు. లక్షల మంది భారతీయ చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడటానికి , భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడానికి చేనేత ఉత్పత్తులపై GSTని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

"దేశంలో రైతులైనా, చేనేత కార్మికులైనా, వారికి అండగా ఉండి వారి కోసం పోరాడేది తెలంగాణ ప్రభుత్వమే. ఈ ఉద్యమంలో భాగమైనందుకు గర్వంగా ఉంది'' అని NAFSCOB చైర్మన్ కొండూరు రవీందర్ రావు ట్వీట్ చేశార.

మరో వైపు, చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలనే ఉద్యమానికిమరింత మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ ఆదివారం change.org వెబ్‌సైట్ లో ఒక పిటిషన్‌ను పోస్ట్ చేశారు.

"ఉదాత్తమైన లక్ష్యం కోసం చేతులు కలపడం ద్వారా చేనేత రంగాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ పిటిషన్‌పై సంతకం చేయాలని, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా సంతకాలు చేయించాలని నేను అభ్యర్థిస్తున్నాను అంటూ #RollbackHandloomGST అనే హ్యాష్ ట్యాగ్‌ని జోడించి ట్వీట్ చేశాడు.

''చేనేతపై జీఎస్టీ విధించడం వల్ల ఈ రంగంపై ఆధార పడి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మందికి అతి పెద్ద‌ ముప్పు వాటిల్లింది. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు చేనేతపై పన్నులను వ్యతిరేకిస్తున్నారు, ఈ జీఎస్టీ వల్ల చాలా మంది ఈ రంగం నుండి నుండి వైదొలగవలసి వచ్చింది, "అని కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.

కేటీఆర్ ఈ పిటిషన్‌ను వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 1,000 మంది సంతకాలు చేయగా, అనేక మంది ఆ పిటిషన్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 





Tags:    
Advertisement

Similar News