పేపర్ లీకేజీ కేసు: రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
ఒక్క రేవంత్ కే కాకుండా పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు అందించాలని సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TSPSC పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేవంత్ ఆధారాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతి నడిపించారని ఆయన అన్నారు.
లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజశేఖర్, కేటీఆర్ పీఏ తిరుపతివి పక్క పక్క గ్రామాలని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ పీఏ తిరుపతి , రాజశేఖర్ సన్నిహితులకే గ్రూప్ 1లో అత్యధిక మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.గ్రూప్ 1లో 100 మార్కులకు పైగా వచ్చిన వారందరి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ పీఏ తిరుపతి సూచన మేరకు... రాజశేఖర్‌కు టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి రాజశేఖర్ ను టీఎస్ పీఎస్సీకి పంపించారన్నారు
రేవంత్ రెడ్డి.
ఈ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి వాటన్నంటికీ ఆధారాలు అందజేయాలని సిట్ తన నోటీసులో కోరింది.
ఒక్క రేవంత్ కే కాకుండా పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్న ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పేపర్ లీకేజీ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించిన వివరాలు, ఆధారాలు అందించాలని సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తనకు సిట్ నోటీసులు ఇంకా అందలేదని రేవంత్ రెడ్డి అన్నారు. సిట్ నోటీసులకు మాకు భయం లేదని, సిట్‌కు ఎటువంటి ఆధారాలు ఇవ్వబోమని ప్రకటించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ఆధారాలు ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సమస్య పరిష్కారం కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.