సంక్షేమ పథకాల డబ్బులన్నీ కాంగ్రెస్‌ నేతల జేబుల్లోకి

అందువల్లే రాష్ట్ర ఆదాయం తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న సీఎం వ్యాఖ్యలకూ కౌంటర్‌

Advertisement
Update:2024-10-29 13:41 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం తగ్గిందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అభివృద్ధి పనులు చేయకుండా కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు తమ జేబులు నింపుకుంటున్నారు. అందువల్లనే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా హయాంలో పదేళ్లలో ఏటా ఆదాయం పెరిగింది. ఎక్కడా అవినీతి లేకుండా చూశామన్నారు. కరోనా సమయంలో ఆదాయం తగ్గలేదన్నారు. అలాగే రుణమాఫీ డబ్బులు, రూ. 4 వేల పింఛన్‌, మహిళలకు ఇస్తానన్న రూ. 2,500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12 వేలు, రైతు కూలీలకు ఇస్తానన్న రూ. 1,000 , పెళ్ల చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం బంగారం ఇవన్నీ కాంగ్రెస్‌ మంత్రులు, నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బీఆర్‌ఎస్‌ పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరెంటు కోతలు, లోవోల్టేజి సమస్యలు నెలకొన్నాయని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. మోటార్లు కాలిపోతున్నాయని, రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈఆర్‌సీ ముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అర్థంపర్థం లేని ప్రతిపాదనలు పారిశ్రామిక రంగానికి దెబ్బకొట్టి ఆర్థికంగా, ఇతర పద్ధతుల్లో రాష్ట్రం నష్టపోయేలా ఉన్నాయని మేము ఉదాహరణలతో వివరించి ఇది తప్పు అని మా వాదనలు వినిపించామన్నారు. వీళ్ల తెలివితక్కువ పనులతోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి ఫైర్‌ అయ్యారు. దీనిపై కూడా తాము స్పష్టంగా ఈఆర్‌సీకి వివరించామన్నారు. గ్రామీణ పరిశ్రమలను కాపాడటానికి తాము చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ఊరట లభించిందన్నారు.

కరెంటు కొంటే దండుగ, ఎందుకు ఇవ్వాలి 24 గంటలు కరెంటు ఇవ్వాలి? అందులో మాకు కమీషన్లు రావు కదా? ఎక్కడైనా కమీషన్లు వచ్చే చోట ఈ డబ్బులు వాడవచ్చని కరెంటు కొనకుండా డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేశారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అందుకే కరెంటు కోతలు వస్తున్నాయన్నారు. కరెంటు కోతలు, లోవోల్టేజిలతోని కాంగ్రెస్‌ అంటే ఏమిటో రైతాంగానికి, ప్రజలకు మరోసారి చూపెడుతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు ఎక్కడా చిన్న సమస్య తలెత్తకుండా అద్భుతంగా తాము నడిపించిన వ్యవస్థను ఎందుకు నిర్వహించలేకపోతున్నారని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News