సీఎం అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న.. ఆ పార్టీ నుంచే పోటీ..!

గతంలో బీజేపీలో చేరిన మల్లన్న తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానంటూ ప్రకటనలు కూడా చేశారు తీన్మార్ మల్లన్న.

Advertisement
Update:2023-10-11 10:51 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 50 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే కేసీఆర్ వ్యతిరేక వైఖరితో పాపులర్‌ అయిన తీన్మార్‌ మల్లన్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ మల్లన్నను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన AIFB.. తీన్మార్‌ మల్లన్న సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది.

మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ మద్దతు కూడా కోరారు. అయితే కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో తీన్మార్ మల్లన్న ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అప్ప‌టికే మేడ్చల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకున్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ స్పందన కోసం కూడా ఎదురుచూశారు. ఈ క్ర‌మంలోనే ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ మ‌ల‌న్న‌ను సంప్ర‌దించింది.

గతంలో బీజేపీలో చేరిన మల్లన్న తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతానంటూ ప్రకటనలు కూడా చేశారు తీన్మార్ మల్లన్న. సొంత పార్టీ పెడతారన్న ప్రచారమూ జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పార్టీ పేరు రిజిస్టర్ చేయించుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే కొన్ని లీగల్‌, టెక్నికల్ సమస్యల కారణంగా ఆ ప్రక్రియ పెండింగ్‌లో పడినట్లు సమాచారం. దీంతో తీన్మార్‌ మల్లన్న ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. 2018 ఎన్నికల్లో రామగుండం నుంచి ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసిన కోరుకంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Tags:    
Advertisement

Similar News