అక్షింతలు వర్సెస్ రేషన్ బియ్యం..
అక్షింతలు అంటే ఏంటో కుటుంబ సభ్యులను అడిగి పొన్నం తెలుసుకోవాలని సూచించారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వాళ్లే అక్షింతలు వేస్తారని సెటైర్లు వేశారు బండి.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ట ఇంకా పూర్తికాకముందే.. ఊరూవాడా అక్షింతలు పంచేస్తున్నారు బీజేపీ నేతలు. మరి ఆ అక్షింతల పవిత్రత ఏంటి..? అవి ఎక్కడినుంచి వచ్చాయి..? ఎలా తయారు చేశారనేది బీజేపీ నేతలకు మాత్రమే తెలిసిన రహస్యం. ఈ క్రమంలో అవి అక్షింతలు కాదు, రేషన్ బియ్యమేనంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు రావడంలేదని ప్రకటించడంతో ఆ పార్టీపై నిందలు మోపుతున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడిలా పొన్నం అక్షింతలను అవహేళన చేశారంటూ మరోసారి మండిపడ్డారు బండి సంజయ్.
అక్షింతలంటే తెలుసా..?
అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్దతి కాదని కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. అక్షింతల ప్రాముఖ్యత గురించి తెలియకుండా మాట్లాడవద్దని సూచించారు. రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అక్షింతలు అంటే ఏంటో కుటుంబ సభ్యులను అడిగి పొన్నం తెలుసుకోవాలని సూచించారు. అక్షింతల గురించి కామెంట్లు చేస్తే వారి ఇంట్లో వాళ్లే అక్షింతలు వేస్తారని సెటైర్లు వేశారు బండి.
మరోవైపు ఊరూవాడా ఆలయాల శుద్ధి మాత్రం జోరుగా సాగుతోంది. ఆలయాన్ని శుద్ధి చేస్తూ ప్రధాని మోదీ వీడియో బయటకు రావడంతో బీజేపీ నేతలు కూడా ఆ స్ఫూర్తితో ముందుకు కదులుతున్నారు. నాయకులంతా గుడికి వెళ్లి చీపురు పడుతున్నారు. నీళ్లతో ఆలయాలను కడిగేస్తున్నారు. బండి సంజయ్ కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. మోదీ పిలుపు మేరకు దేశంలోని ఆలయాలను శుద్ధి చేస్తున్నామని, అక్షింతల కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పారు. అక్షింతలు, రేషన్ బియ్యం అనే వారికి వాటి ప్రాముఖ్యత, పవిత్రత తెలియదన్నారు బండి.