తెలంగాణలో ఎయిర్ టెల్, యూరోఫిన్స్ భారీ పెట్టుబడులు..
రాష్ట్రంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందించడంలో భాగంగా Airtel-Nxtraతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్.
దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. ఈనెల 16న మొదలైన దావోస్ సదస్సులో తొలి రెండురోజులు వివిధ కంపెనీలు తెలంగాణలో విస్తరణకు, పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు కుదుర్చుకున్నాయి. మూడోరోజు ఎయిర్ టెల్, యూరోఫిన్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఎయిర్ టెల్ ఎన్-ఎక్స్ ట్రా డేటా సెంటర్..
భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ తెలంగాణ ప్రభుత్వంతో ఈరోజు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను పెట్టుబడిగా ప్రకటించింది. ఎయిర్ టెల్ గ్రూప్ కి చెందిన సునీల్ భారతి మిట్టల్, రాజన్ భారతి మిట్టల్.. తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎయిర్ టెల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం 2వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది.
భారతదేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ లకు హైదరాబాద్ కేంద్రంగా ఉండేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుందని తెలిపారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను రూపొందించడంలో భాగంగా Airtel-Nxtraతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారాయన.
భారత్ లో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ లలో ఇది ఒకటి అని తెలిపారు ఎయిర్ టెల్ ప్రతినిధులు. తెలంగాణతో కలిసి పని చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది దావోస్ సదస్సులోనే డేటా సెంటర్ ప్రాజెక్ట్ పై చర్చలు జరిగాయని గుర్తు చేశారు. ఎయిర్ టెల్ బిజినెస్ లో ఇతర పోర్ట్ ఫోలియోలలో కూడా తెలంగాణతో కలసి నడుస్తామన్నారు.
యూరోఫిన్స్ వెయ్యికోట్ల పెట్టుబడులు..
ఆహారం, పర్యావరణం, ఫార్మాసుటికల్, కాస్మెటిక్ ఉత్పత్తుల రంగాల్లో టెస్టింగ్ ల్యాబొరేటరీ సేవలు అందిస్తున్న యూరోఫిన్స్ సంస్థ.. తెలంగాణలో అత్యాధునిక ప్రయోగశాల క్యాంపస్ ను స్థాపించడానికి ఆసక్తి ప్రదర్శించింది. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్, బయో అనలిటికల్ సర్వీసెస్, ఇన్-వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలలో గ్లోబల్, ఇండియన్ ఫార్మాసుటికల్ క్లయింట్ లతో పాటు.. చిన్న బయోటెక్ కంపెనీలకు ఈ క్యాంపస్ తో ఉపయోగం ఉంటుందని తెలిపారు. కరోనా సమయంలో యూరోఫిన్స్ సంస్థ దాదాపు 2కోట్లమందికి కొవిడ్ పరీక్షల మెటీరియల్ సప్లై చేసింది.
యూరోఫిన్స్ మేనేజ్ మెంట్ మంత్రి కేటీఆర్ బృందంతో తెలంగాణలో వెయ్యికోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు భారీ పెట్టుబడులతో తెలంగాణ పరిశ్రమల రంగానికి మరింత మేలు జరుగుతుంది.