ఎయిర్‌పోర్ట్ మెట్రో వల్ల వాటికి నష్టం లేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్ఎంఆర్ఎల్

ఎయిర్‌పోర్ట్ మెట్రో, బీహెచ్ఈఎల్-లకిడీకపూల్ కారిడార్ల నిర్మాణం వల్ల ఇప్పటికే ఆ మార్గంలో ఉన్న ఫ్లైవోవర్లకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది.

Advertisement
Update:2022-12-13 05:51 IST

హైదరాబాద్ నగరానికి తలమానికంగా మారబోతున్న ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 9న శంకుస్థాపన చేశారు. ఈ మెట్రో నిర్మాణానికి అయ్యే రూ.6,250 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించనున్న ఈ కారిడార్ కారణంగా పలు ఫ్లైవోవర్ల పటిష్టతకు ప్రమాదం ఏర్పడుతుందనే వార్తలు వచ్చాయి. ప్రతిపాదించిన మార్గంలో కొన్ని ప్లైవోవర్లు ఉన్నాయి. ముఖ్యంగా బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి చౌరస్తాల వద్ద ఉన్న ఫ్లైవోవర్లకు ముప్పు ఏర్పడుతుందనే అనుమానాలు కూడా నెలకొన్నాయి.

ఇక బీహెచ్ఈఎల్ నుంచి లకిడీకపూల్ వరకు నిర్మించనున్న మరో మెట్రో మార్గానికి కూడా ఎక్స్‌ప్రెస్ మెట్రో అడ్డుస్తుందనే అనుమానాలు నెలకొన్నాయి. బీహెచ్ఈఎల్-లకిడీకపూల్ మార్గంలో కూడా మెట్రో నిర్మించాలంటే అనేక ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లు దాటాల్సి ఉంటుందని, మెట్రో నిర్మాణం వల్ల వీటి మనుగడ కూడా కష్టమవుతుందనే వాదన ఉన్నది. ఒక వేళ ఈ ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లకు హాని జరుగకుండా రూట్ అలైన్‌మెంట్‌లో మార్పు చేస్తే అదనంగా రూ. 5వేల కోట్ల వ్యయం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ రెండు రూట్లలో మెట్రో నిర్మాణం కారణంగా ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్మించిన ఫ్లైవోవర్లు దెబ్బతింటాయని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా వీటిపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) స్పష్టత ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్ మెట్రో, బీహెచ్ఈఎల్-లకిడీకపూల్ కారిడార్ల నిర్మాణం వల్ల ఇప్పటికే ఆ మార్గంలో ఉన్న ఫ్లైవోవర్లకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేసింది. వాటి పటిష్టతకు ప్రమాదం లేదని.. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తి చేసినట్లు వివరించింది. హెచ్ఎంఆర్ఎల్‌కు చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్లు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయం చేసుకుంటూ.. ప్రతిపాదించిన రెండు కారిడార్లలో ఉన్న నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. ఎస్ఆర్‌డీపీ కింద నిర్మించిన, నిర్మించబోయే ఫ్లైవోవర్లకు ఎలాంటి ముప్పు ఉండబోదని ఇప్పటికే నిర్దారణ అయినట్లు తెలిపింది. ప్రతిపాదిత మార్గంలో ఉన్న 18 బ్రిడ్జిలు, ఫ్లైవోవర్లు, అండర్ పాస్‌లు సురక్షితంగా ఉంటాయని హెచ్ఎంఆర్ఎల్ స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News