ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ లొల్లి.. సీనియర్ లీడర్లకు హైకమాండ్ పిలుపు
సీనియర్ల మాటలు విని, వారిని కాపాడుకునేందుకు రేవంత్ వర్గానికి చెక్ పెడుతుందని అందరూ భావించారు. కానీ ఏఐసీసీ అగ్రనాయకులు మాత్రం రేవంత్‌కే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లకు, రేవంత్ వర్గానికి మధ్య రగిలిన చిచ్చుతో రాష్ట్రానికి దిగ్విజయ్ సింగ్‌ను హైకమాండ్ పంపింది. 'సేవ్ కాంగ్రెస్' పేరుతో సీనియర్లు కీలక సమావేశాలు డుమ్మా కొట్టి వేరుగా మీటింగ్స్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎక్స్‌టెండెడ్ ఎగ్జిక్యూటీవ్ కమిటీల్లో ఎక్కువగా తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని, రేవంత్ రెడ్డి తన వర్గపు వ్యక్తులతో కమిటీలను నింపుకున్నారని సీనియర్లు ఆరోపించారు. దీంతో ఏఐసీసీ దూతగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి ఇరు వర్గాల వాదనలను నమోదు చేశారు.
దిగ్విజయ్ సింగ్ రూపొందించిన నివేదిక ఇప్పటికే అధిష్టానానికి చేరింది. చాలా మంది సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరినట్లు తెలుస్తున్నది. అయితే హైకమాండ్ మాత్రం రేవంత్‌ను కదిపే ప్రసక్తి లేదని తేల్చినట్లు సమాచారం. ఇప్పటికే తిరుగుబాటు చేసిన సీనియర్ నాయకులను ఢిల్లీకి రమ్మని అధిష్టానం ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు తిరుగుబాటు చేసిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ టి. జీవన్ రెడ్డితో పాటు ఇతర నాయకులను కూడా ఢిల్లీకి రమ్మన్నారు.
వలస నాయకులు అంటూ సీనియర్లు ఆరోపించడంపై కూడా అధిష్టానం సీరియస్‌గా ఉన్నది. ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ అందరితో మాట్లాడారని.. సీనియర్లు రేవంత్ పైనే ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌ను కూడా తప్పించాలని సీనియర్ల డిమాండ్ చేసినట్లు సమాచారం. సీనియర్ నేతలకు అధిష్టానం క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. రేవంత్ వర్గంలోని 12 మంది రాజీనామాలను కూడా ఏఐసీసీ ఆమోదించదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్ల మాటలు విని, వారిని కాపాడుకునేందుకు రేవంత్ వర్గానికి చెక్ పెడుతుందని అందరూ భావించారు. కానీ ఏఐసీసీ అగ్రనాయకులు మాత్రం రేవంత్‌కే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తున్నది. నాయకత్వ మార్పులు ఉండబోదని జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. ఇటీవల పార్లమెంట్ సెషన్స్ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆమెకు వివరించినట్లు తెలుస్తున్నది. త్వరలో చేపట్టబోయే పాదయాత్ర గురించి కూడా చెప్పారని.. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు వెళ్లాలని సోనియా సూచించినట్లు రేవంత్ వర్గీయులు చెబుతున్నారు.
ఒక వేళ అధిష్టానం తెలంగాణలో పార్టీ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. మాణిక్యం ఠాకూర్‌ను తొలగించే అవకాశం ఉందని తెలుస్తున్నది. అంతే కానీ.. రేవంత్‌కు మాత్రం ఇప్పట్లో ఎలాంటి ఢోకా లేదని సమాచారం. ఢిల్లీకి సీనియర్లు వచ్చిన తర్వాత వారి మధ్య సయోధ్య కుదురుస్తారని.. ఎన్నికల వరకు అందరూ ఐక్యంగా పని చేయాలని ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి 'సేవ్ కాంగ్రెస్' పేరుతో సీనియర్లు హడావిడి చేసినా.. అది అధిష్టానంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. దీంతో ప్రస్తుతానికి సీనియర్ నాయకులు సైలెంట్ అయిపోయారు.