నీళ్లు తరలించాక.. నిద్రలేచిన కాంగ్రెస్‌ సర్కార్‌

కేఆర్‌ఎంబీ సమావేశంలో టెలీమెట్రీ స్టేషన్ల అంశాన్ని ప్రస్తావించాలన్న సీఎం

Advertisement
Update:2024-12-03 13:13 IST

టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాట్ల అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నది. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని , కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటున్నదో లెక్కలు తీయాలన్నా సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో దశ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుతో పాటు మొదటి దశలోని పరికరాల మార్పులపై చర్చించనున్నది. మొదటి దశలో ఏర్పాటు చేసిన టెలీమెట్రీ స్టేషన్ల ఆధునీకరించడంతో పాటు రెండో దశలో ఏర్పాటు చేయనున్న టెలీమెట్రీ స్టేషన్ల పై చర్చించనున్నది. ఏపీ విభజన అనంతరం కృష్ణా నది జలాశయాలకు సంబంధించిన అన్ని ఔట్‌లెట్ల నుంచి వినియోగించిన నీటిని లెక్కించడానికి టెలీమెట్రీ స్టేషన్ల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కేఆర్‌ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొదటి దశలో 18 టెలీమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జూరాల, కోయిల్‌సాగర్‌, నెట్టంపాడు, బీమా, కల్వకుర్తి, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, పాలేరు రిజర్వాయర్‌, నాగార్జునసాగర్‌ కాల్వలు, ఏమ్మార్పీ ఎత్తిపోతలు, పాలేరు రిజర్వాయర్‌ ఔట్‌ లెట్లు ఈ జాబితాలో ఉన్నాయి. రెండో విడతలో సాగర్‌ కుడి, ఎడమ కాల్వలపై మరికొన్ని పాయింట్లు, పాలేరు జలాశయం పై మరోచోట, పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కింద ఏర్పాటు చేయనున్నారు.

ఏపీలో మొదటి విడతలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలు, శ్రీశైలం ఎస్‌ఆర్‌ఎంసీ, రెండో విడతలో పోలవరం కుడి కాలువ కలిసేచోట, కేసీ కెనాల్‌, ప్రకాశం బ్యారేజీ పశ్చిమ ప్రధాన కాల్వలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకుంటున్న నీటిని లెక్కిస్తున్నారు. రెండో విడతలో మరో 9 టెలీమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని 2018 అక్టోబర్‌లో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో నిర్ణయించారు. మొదటి దఫా అనుభవంతో సెన్సార్లు కాకుండా సైడ్‌ లుకింగ్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్స్‌ పెట్టాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అంచనాలను రూపొందించారు.

ఏపీ శ్రీశైలంలో నీళ్లను తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ధ్వజమెత్తింది. గత నెల రోజుల్లోనే 93 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయిందని, దీనివల్ల యాసంగిలో సాగు నీటితో పాటు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని బీఆర్‌ఎస్‌ విమర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయం చాలదన్నట్టు.. ఇప్పుడు అసమర్థ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది నీళ్ళను ఆంధ్రాకు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నాడని మండిపడింది. తెలంగాణ ప్రయోజనాలను ఎవరి కోసం ఫణంగా పెడుతున్నావని నిలదీసింది.

Tags:    
Advertisement

Similar News