ఐటీ శాఖతో 22 ఏళ్ళ పోరాటం.. 2.5 కేజీల బంగారాన్ని దక్కించుకున్న అన్నదమ్ములు
2000 సంవత్సరంలో తమ తండ్రి నుంచి ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న బంగారం కోసం 22 ఏళ్ళ పాటు పోరాడిన ఓ కుటుంబం చివరకు విజయం సాధించింది. హైదరాబాద్ లో నివసించే ఈ జైన్ కుటుంబానికే ఆ బంగారం చెందాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తమ బంగారం కోసం ఆదాయపు పన్ను శాఖతో 22 ఏళ్ళ పాటు న్యాయపోరాటం చేసి ఆ బంగారాన్ని దక్కించుకున్న కుటుంబ కథ ఇది. బహుశా దేశంలో మరెక్కడా ఇలాంటిది జరగలేదని ఈ కుటుంబ సభ్యులు అంటున్నారు.ఈ ఉదంతం పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2000 సంవత్సరం ఫిబ్రవరి 10 న ఐటీ శాఖ హైదరాబాద్ లోని ఓ వ్యాపారి కుటుంబం నుంచి 2,462 గ్రాముల బంగారాన్ని. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. నీలేష్ కుమార్ జైన్, ముకేశ్ జైన్ అనే ఇద్దరు సోదరులకు సంబంధించిన కేసిది. వీరి తలిదండ్రుల ఇంటి నుంచి వీటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోగా దీనిపై ఈ సోదరులు కోర్టుకెక్కారు. వారసత్వ రీత్యా ఈ బంగారం తమకే చెందాలని వీరు తెలంగాణ హైకోర్టులో వాదించారు. కానీ వీరు వేర్వేరుగా వారసత్వ సర్టిఫికెట్లను సమర్పించాలని ఈ శాఖ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసు కోర్టులో సాగుతుండగా వీరి తలిదండ్రులు మరణించడంతో.. ఐటీ శాఖ ఈ సర్టిఫికెట్ల విషయంలో మరింత పట్టుబట్టింది. అయితే నీలేష్ కుమార్, ముకేశ్ జైన్ సైతం ఈ శాఖ అధికారులు తమనిలా ఒత్తిడి చేయడం తగదని, తాము ఈ బంగారానికి చట్టబధ్ధమైన వారసులమని తమ న్యాయవాది ద్వారా వాదిస్తూ వచ్చారు. 2020 లోని డైరెక్ట్ టాక్స్ వివాద్ సే విశ్వాస్ చట్టం కింద వారసులు ఇలాంటి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చునన్న వెసులుబాటు ఉందని వీరు పేర్కొన్నారు. దీంతో గత ఏడాది మార్చ్ 31 న ఈ కేసు పరిష్కారమైందంటూ ఐటీ అధికారులు ఓ ఆర్డర్ జారీ చేశారు. కానీ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. తమ బంగారు నగలను తమకు తిరిగి ఇవ్వాలని నీలేష్ , ముకేశ్ కోరగా తిరిగి అధికారులు పాత పాటే పాడారు. ఈ సోదరులు వేర్వేరు వారసత్వ సర్టిఫికెట్లను సమర్పించాలని డిమాండ్ చేశారు.
అయితే పిటిషనర్ల తరఫున వాదించిన లాయర్ శరద్ సంఘ్.. ఇండియన్ బ్యాంక్ నుంచి తమ డిపాజిట్ ని విత్ డ్రా చేసుకునేందుకు అనువైన ఆర్డర్ వీరివద్ద ఉందని, అందువల్ల రెండో వారసత్వ సర్టిఫికెట్ ఇక అవసరం లేదని అన్నారు. ఈ సర్టిఫికెట్ నే ఐటీ అధికారులు అంగీకరించాలని ఆయన కోరారు. ఐటీ తరఫున జేవీ. ప్రసాద్ అనే న్యాయవాది వాదిస్తూ బంగారాన్ని ఈ సోదరులకు అప్పగించిన పక్షంలో వీరి సోదరి కూడా తనకే అది చెందాలని పట్టుబట్టవచ్చునని అన్నారు. అదే పరిస్థితి వస్తే ఆమె తన సోదరులపై కేసు వేయవచ్చునని, అంతే తప్ప ఐటీ శాఖపై కాదని కోర్టు పేర్కొంది.
చివరకు ఈ కేసు నీలేష్, ముకేశ్ సోదరులకు అనుకూలంగా వచ్చింది. 22 ఏళ్ళక్రితం ఐటీ అధికారులు వీరి తలిదండ్రుల ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 2.5 కేజీల బంగారాన్ని తక్షణమే ఈ సోదరులకు అప్పగించాలని తెలంగాణ హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది. వేర్వేరు వారసత్వ సర్టిఫికెట్లను సమర్పించాలని పిటిషనర్లను ఐటీ శాఖ ఒత్తిడి చేయజాలదని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందాతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పునిస్తూ ఈ కేసు పరిష్కారమైనట్టు ప్రకటించారు.