అభివృద్ధి చెందుతున్నప్పుడు హైదరాబాద్ వదిలి అమెరికా ఎందుకెళ్లాలి..?
ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి వినూత్న ఉత్పత్తుల ద్వారా కొత్త శిఖరాలను అందుకోవాలని చెప్పారు శంతను నారాయణ్. ఏ కంపెనీకయినా అందులో పనిచేసే ఉద్యోగులే గొప్ప నిధి అని చెప్పారు.
మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటే హైదరాబాద్ వదిలి అమెరికాకు ఎందుకెళ్లాలి అని ప్రశ్నించారు అడోబ్ కంపెనీ సీఈఓ శంతను నారాయణ్. తానయితే హైదరాబాద్ వదిలి ఎక్కడికీ వెళ్లనన్నారు. హైదరాబాద్ లో జరిగిన టై గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఈఓ ఆఫ్ ది ఇయర్ -2022 పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా తన సంతోషం వ్యక్తం చేశారు. ఆలోచన, మూలధనం, నైపుణ్యం అనేవి.. స్టార్టప్ సంస్థలను స్థాపించేందుకు కీలకం అని చెప్పారాయన. సవాళ్లు ఎదురైనప్పుడే విజయాలు సాధించేందుకు మార్గాలు కూడా దొరుకుతాయని వివరించారు. అడోబ్ అభివృద్ధి చేయబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాల కోసం హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు
ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి వినూత్న ఉత్పత్తుల ద్వారా కొత్త శిఖరాలను అందుకోవాలని చెప్పారు శంతను నారాయణ్. ఏ కంపెనీకయినా అందులో పనిచేసే ఉద్యోగులే గొప్ప నిధి అని చెప్పారు. వచ్చే ఏడాదికి అడోబ్ తో తన ప్రస్థానం పాతికేళ్ల మైలురాయికి చేరుకుంటుందని అన్నారు. ఈ పాతికేళ్లలో ఎన్నో మార్పులు చూశానని, మార్కెట్ లో ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవాలనుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తారని, కానీ గొప్ప స్థానం కోసం కృషి చేసేవారే ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పారు. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు సవాళ్లను అధిగమించి, ఉన్నత స్థానానికి చేరుకున్న విధానాన్ని వివరించారు నారాయణ్.
డిజిటల్ అవసరాలున్న ప్రతిచోటా అడోబ్ ఉండాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు నారాయణ్. సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్ సేవలను ప్రారంభించిన తొలి సంస్థ తమదేనని వెల్లడించారు. ఏ రంగంలో ఉన్నా, సంస్థలు తమ వినియోగదారుల అవసరాలను పసిగట్టాలన్నారు. స్టార్టప్ కంపెనీలు.. పెద్ద సంస్థలుగా మారాలంటే దార్శనికత, అత్యున్నత పనితీరు అవసరం అని చెప్పారు. మానవ వనరులను ప్రోత్సహించాలన్నారు. స్టార్టప్ ల స్థాపనకు హైదరాబాద్ లో ఎన్నో అవకాశాలున్నాయని, ఐటీ వృద్ధికి మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.