కరెంటు బిల్లుల వసూలు బాధ్యత అదానీకి.. రేవంత్‌ సర్కార్‌ నిర్ణయం!

ఈ విధానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్ర విమర్శలు సైతం వస్తున్నాయి. ఇది పట్టపగలు దోపిడీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం సరికాదంటున్నాయి.

Advertisement
Update: 2024-06-29 07:33 GMT

తెలంగాణలో కరెంటు బిల్లు వసూలు బాధ్యతను అదానీ గ్రూపున‌కు కట్టబెట్టే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్‌. పైలట్ ప్రాజెక్టుగా పాతబస్తీలో విద్యుత్ బకాయిలు వసూలు చేసే బాధ్యతను అదానీ గ్రూప్‌కి అప్పగించబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉండగా.. మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయం చెప్పారు. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూలు సరిగ్గా జరగడం లేదని, బకాయిల వసూలుకు వెళ్తే విద్యుత్ సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే అదానీ గ్రూప్‌కి ఈ బాధ్యతను అప్పగించబోతున్నామని చెప్పారు.


తర్వాత క్రమంగా ఈ విధానాన్ని హైదరాబాద్‌, అనంతరం రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు రేవంత్‌. వసూలు చేసిన బకాయిల్లో 75 శాతం ప్రభుత్వానికి, 25 శాతం అదానీ సంస్థ‌కు వెళ్తుందన్నారు. ఇప్పటికే అదానీ గ్రూప్‌తో చర్చలు ముగిశాయని, నిబంధనలకు అదానీ గ్రూప్ అంగీకరించిందని స్పష్టం చేశారు.

కాగా, ఈ విధానంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తీవ్ర విమర్శలు సైతం వస్తున్నాయి. ఇది పట్టపగలు దోపిడీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం సరికాదంటున్నాయి. గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. మళ్లీ బిల్లు వసూలు బాధ్యతను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News