ఎమ్మార్వో అక్రమాలు.. ట్రంకుపెట్టెనిండా నోట్ల కట్టలు
2వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి కాబట్టి ఆయన ఇంట్లో ఆ డినామినేషన్లు దొరకలేదు. ప్రస్తుతం దొరికినవన్నీ రూ.500 నోట్లే.
లంచావతారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే వేలు, లేదా లక్షల్లో సొమ్ము అధికారులకు దొరుకుతుంది. అదే పక్కా సమాచారంతో ఇళ్లపై దాడులు చేస్తే ఇదిగో ఇలా కట్టలు కట్టలుగా పాపాల పుట్టలు బయటపడతాయి. ఓ ట్రంకు పెట్టెలో ఏకంగా 2కోట్ల రూపాయలు దాచి ఉంచాడు సదరు ఎమ్మార్వో. ఆయన పేరు మహేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ గా పనిచేస్తున్నాడు. వనస్థలిపురం హస్తినాపురంలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
అన్నీ రూ.500 నోట్లే..
2వేల రూపాయల నోట్లు రద్దయ్యాయి కాబట్టి ఆయన ఇంట్లో ఆ డినామినేషన్లు దొరకలేదు. ప్రస్తుతం దొరికినవన్నీ రూ.500 నోట్లే. 2కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకున్నారంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. లెక్కల్లోకి రాకుండా దాచిన ఆ సొమ్ము ఎక్కడిదని అధికారులు ప్రశ్నిస్తే నీళ్లు నమిలాడు మహేందర్ రెడ్డి. బంగారం కూడా భారీగానే దొరికింది. స్థిర చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఇటీవల కాలంలో ఎమ్మార్వో అక్రమాలపై ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులందాయి. అక్రమాస్తులు కూడబెడుతున్నారనే కంప్లయింట్లు వచ్చాయి. దీంతో కొన్నిరోజులు క్రితమే అధికారులు దాడులకు ప్లాన్ గీశారు. ఎమ్మార్వో ఇంటితోపాటు, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఎమ్మార్వో ఇంటిలో ట్రంకు పెట్టెలో నోట్లకట్టలు చూసి షాకయ్యారు అధికారులు.