ముస్తాబవుతోన్న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో!

వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం దేశానికి 24గంటల విద్యుత్‌ సరఫరా హామీని బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలో చేర్చనుంది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెడతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చనుంది బీఆర్‌ఎస్‌.

Advertisement
Update:2023-06-26 09:27 IST

ముస్తాబవుతోన్న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో!

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతిపక్షాలు చేరికల మీద ఫోకస్‌ పెడితే, అధికార పక్షం ఎన్నికల మేనిఫెస్టో మీద దృష్టిపెట్టింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీఆర్‌ఎస్, ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటోంది. వచ్చే టర్మ్‌లోనూ సంక్షేమ పాలన అందిస్తామనే హామీతో ఎన్నికలకు వెళ్లనుంది. అందుకోసం రైతు రాజ్యం కేంద్రంగా మేనిఫెస్టోను రూపొందించే పనిలోపడింది.

దేశానికి కాంగ్రెస్‌, బీజేపీ తీరని అన్యాయం చేశాయని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారు. దేశంలో అపారమైన వనరులున్నా వాటిని వినియోగించుకోవడంలో దేశాన్ని 75ఏళ్లుగా పాలిస్తున్న పార్టీలు విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. దేశంలో ఇప్పటికీ వేలాది గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఫల్యాలను సరిచేసే ప్రణాళికలను ప్రజలముందుంచాలనుకుంటోంది బీఆర్‌ఎస్‌. వ్యవసాయానికి పెద్దపీట, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ పాలన ప్రధానాంశాలుగా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారట.

అంతరాష్ట్ర జలవివాదాల కారణంగా దేశంలో సాగుకు యోగ్యమైన లక్షలాది ఎకరాలు నిరుపయోగంగా బీడుబారిపోతున్నాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. దేశంలోని 15,83,20,000 హెక్టార్ల సాగుభూమిలో కేవలం 35 శాతం భూమికి మాత్రమే సాగునీరు అందుతోందని, మిగతా భూముల్లో రైతులు వర్షాలపై ఆధారపడి సాగు చేసుకుంటున్నారని అంటోంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కావడంతో ఈ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వాల బాధ్యత అంటోంది. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పాలకులెవరూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం, రాష్ట్రాల మధ్య జలవివాదాలను హేతుబద్ధంగా పరిష్కరించడం కోసం ప్రయత్నించలేదని ఆరోపిస్తోంది.

గోవా- కర్ణాటక; ఏపీ-తెలంగాణ; పంజాబ్‌ - హర్యానా - రాజస్థాన్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌; కేరళ- తమిళనాడు, తమిళనాడు-కర్ణాటక మధ్య జలవివాదాలే అందుకు ఉదాహరణ అంటోంది. ఈ వైఫల్యాలను ఎండగట్టే ఎజెండాతో గులాబీ పార్టీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటోంది. పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఫలితాలను భవిష్యత్తులో దేశానికి అందివ్వాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. అందుకోసం తెలంగాణ నమూనాను ఆదర్శంగా చూపిస్తూ మేనిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అనుకుంటున్నారట.

వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం దేశానికి 24గంటల విద్యుత్‌ సరఫరా హామీని బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలో చేర్చనుంది. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెడతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చనుంది బీఆర్‌ఎస్‌. ఎన్నికల మేనిఫెస్టో ద్వారా "ఆబ్‌ కా బార్‌ కిసాన్‌ సర్కార్‌' నినాదాన్ని దేశ ప్రజానీకంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు గులాబీ దళపతి కసరత్తు చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల వ్యూహం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News