రేవంత్‌ సర్కార్‌ రివర్స్‌ పాలన!

ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-07-13 09:56 IST

రేవంత్‌ సర్కార్‌ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రైతుబంధు తిరిగి చెల్లించాలంటూ ఇటీవల ఓ రైతుకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. వృద్ధుల పెన్షన్ల విషయంలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి నోటీసులు పంపింది ప్రభుత్వం. ఇప్పటివరకూ పెన్షన్ కింద పొందిన రూ.లక్షా 72 వేలు తిరిగి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. పక్షవాతం వచ్చి మంచాన పడిన వృద్ధురాలికి నోటీసులు పంపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ సర్కార్‌ తీరు కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుందని ఎద్దేవా చేశారు. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్‌.. ఇప్పుడు రాష్ట్రంలో లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు.


ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారుల నుంచి డబ్బును వెనక్కి పంపాలని రేవంత్ సర్కార్‌ నోటీసులు ఇస్తోందన్నారు. పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన లక్షా 72 వేల రూపాయలు వెనక్కి కట్టాలని నోటీసు ఇచ్చారన్నారు కేటీఆర్. ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మ వంటి వృద్ధుల నుంచి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు కేటీఆర్. వెంటనే పేదల మీద ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలన్నారు కేటీఆర్. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడడం ఖాయమని హెచ్చ‌రించారు.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా చేయూత పథకం కింద వృద్ధుల పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ.. ఇప్పటివరకూ ఆ హామీని అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పటికీ గత ప్రభుత్వం ఆసరా పేరుతో ఇచ్చిన రెండు వేల రూపాయలనే ఇస్తోంది రేవంత్ సర్కార్‌. చాలా ప్రాంతాల్లో పెన్షన్ రావట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల పలువురు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుబంధు విషయంలోనూ రేవంత్‌ సర్కార్ లబ్ధిదారుల సంఖ్య‌ను భారీగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ వ్యవహారం బెడిసికొట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News