హైదరాబాద్ లో వ్యభిచారులను దోచుకొని కోట్లు సంపాదిస్తున్న హైటెక్ ముఠా
సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం... హైదరాబాద్ కు అక్రమ రవాణా అవుతున్న మహిళల్లో 50 శాతం మంది బెంగాల్ నుంచి, 20 శాతం కర్నాటక నుంచి, మహారాష్ట్ర నుంచి 15 శాతం, ఢిల్లీ నుంచి 7 శాతం, ఇతర రాష్ట్రాల నుంచి 5% శాతం ఉన్నారు.
హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం నడిపించే ముఠాలు పెచ్చుమీరుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ముఠాలు వ్యాపారం సాగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అమ్మాయిలను రప్పించి వాళ్ళను కస్టమర్ల దగ్గరికి పంపి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. వచ్చిన సొమ్ములో బాధితులైన అమ్మాయిలకు 30 శాతం సొమ్మును ఇచ్చి మిగతా 70 శాతం ఈ హైటెక్ ముఠా దోచుకుంటోంది.
సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం... హైదరాబాద్ కు అక్రమ రవాణా అవుతున్న మహిళల్లో 50 శాతం మంది బెంగాల్ నుంచి, 20 శాతం కర్నాటక నుంచి, మహారాష్ట్ర నుంచి 15 శాతం, ఢిల్లీ నుంచి 7 శాతం, ఇతర రాష్ట్రాల నుంచి 5% శాతం ఉన్నారు. అంతే కాదు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాతో సహా ఇతర దేశాలకు చెందిన పలువురు మహిళలు కూడా ఈ హైటెక్ వ్యభిచార రాకెట్ చేతిలో బాధితులయ్యారు.
ఇక్కడి వ్యభిచార నిర్వాహకులు, ఇతర రాష్ట్రాల్లోని, విదేశాల్లోని బ్రోకర్లు సభ్యులుగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల , దేశాల బ్రోకర్లు ఆ వాట్సాప్ గ్రూపుల్లో మహిళల చిత్రాలను పోస్ట్ చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. "నిర్వాహకులు ఒక మహిళను ఎంపిక చేసి, బ్రోకర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, టూరిస్ట్ వీసా ఏర్పాటు చేసి బాధితురాలిని ఇక్కడికి రప్పిస్తారు. ఇక్కడ దిగగానే మహిళలను కస్టమర్ల వద్దకు పంపిస్తారు'' అని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
వినియోగదారుల నుంచి సేకరించిన మొత్తంలో 30 శాతం బాధిత మహిళలకు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని నిర్వాహకులు, ఇతర వాటాదారులు జేబుల్లో వేసుకుంటున్నారు. నిర్వాహకులు ప్రతి కస్టమర్‌పై 50 శాతం నుంచి 70 శాతం వరకు లాభం పొందుతున్నారు. బాధితురాలు మాత్రం అతి తక్కువ సొమ్ముతో బతుకులీడ్వాల్సిన దుస్థితి.
ఈ వ్యభిచార నిర్వహణ కోసం ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ నుండి పూర్తి స్థాయి కాల్ సెంటర్ పనిచేస్తోంది. వాటిని నిర్వహించే వారు కస్టమర్ల నుండి కాల్స్ తీసుకొని స్థానిక నిర్వాహకులకు అందిస్తారు. వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ అడ్వర్టైజ్‌మెంట్ పోర్టల్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ వ్యాపార మార్కెటింగ్ జరుగుతోంది.
కొన్ని ప్రయివేటు కంపెనీల్లో అధిక జీతభత్యాల పేరుతో మహిళలను మోసగించి, ఆ తర్వాత వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. నిర్వాహకులు ,బ్రోకర్ల ఉచ్చులో పడే మహిళలను రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఈ నిర్వాహకులు, బ్రోకర్లు మహిళలకు విలాసవంతమైన జీవితాన్ని ఆశగా చూపి వారిని ట్రాప్ చేస్తారు. కొన్నిసార్లు వారికి మిథైలెన్డియోక్సి మెథాంఫేటమిన్ (MDMA )మందులు ఇస్తారు. (ఈ మందులు చట్ట విరుద్దమైనవి. వీటి వాడకం వల్ల మనిషిలో భ్రాంతి కలగజేస్తుంది. అత్యంత శక్తి వచ్చినట్టు భ్రమ ఏర్పడుతుంది. కళ్ళ ముందు జరిగే విషయాలను అర్దం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఈ మందులు వాడినప్పుడు ఇతరుల స్పర్ష విపరీతమైన ఆనందాన్ని కలగజేస్తుంది. ) దాంతో మహిళలు నిర్వాహకుల డిమాండ్‌కు బలవంతంగా లొంగిపోతారు. చాలా మంది మహిళలు, బాలికలు పేద ఆర్థిక నేపథ్యం వల్ల, కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాల వల్ల ఈ రొంపిలో చిక్కుకుంటున్నారు.
ఒక వైపు ప్రభుత్వాలు వ్యభిచారాన్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు చేపట్టినా అవి వృధాగానే మిగిలిపోతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడులు చేసి ముఠాలను పట్టుకోవడం, బాధితులను విడిపించడం లాంటివి చేస్తున్నప్పటికీ ఇవి ఇంకా కొనసాగడానికి పేదరికం ప్రధాన కారణం. మహిళల పేదరికాన్ని అలుసుగా తీసుకునే ముఠాలు వారిని లొంగదీసుకొని వారిపై కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.