అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన‌ వ్యక్తిపై కేసు నమోదు

జిల్లాలో ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు నిర్వాహకులు ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని, శాంతికి విఘాతం కలుగ చేసిన ఇటువంటి వారిని ప్రోత్సహించే నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి అన్నారు.

Advertisement
Update:2022-12-30 16:41 IST

అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త, నాస్తిక సంఘం నాయకుడు బైరి నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్ లో జరిగిన ఓ సమావేశంలో నరేష్ ఈ విధమైన మాటలు మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ యన్. కోటి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

బైరీ నరేష్ పై 153-A, 295-A, 298, 505(2) IPC కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన‌ చెప్పారు. ఎవరైనా ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జిల్లాలో ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు నిర్వాహకులు ఇలాంటి వారిని ప్రోత్సహించకూడదని, శాంతికి విఘాతం కలుగ చేసిన ఇటువంటి వారిని ప్రోత్సహించే నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని కోటి రెడ్డి అన్నారు.


మరో వైపు బైరి నరేష్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. ర్యాలీగా పట్టణంలోని ఇందిరా చౌరస్తా వరకు చేరుకుని అక్కడ స్వాములంతా మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News