పటేల్ ప్రజలను కలపడానికి వస్తే, అమిత్ షా విడదీయడానికి వచ్చారు -కేటీఆర్
74 ఏళ్ళ క్రితం అప్పటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ప్రజలను ఐక్యం చేయడానికి వస్తే, ఇప్పటి హోం మంత్రి అమిత్ షా ప్రజలను విడదీయడానికి వచ్చారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
సెప్టంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమం చేసింది కేంద్రం ప్రభుత్వం. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ కార్యక్రమానికి వచ్చారు. ప్రతీ సారి లాగే ఈ సారి కూడా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై, టీఆరెస్ పై ఆరోపణలు గుప్పించారు. ముస్లింలకు భయపడి రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినం జరపడం లేదని పరోక్షంగా విమర్శలు చేశాడు అమిత్ షా. అయితే విమోచన దినం పేరుతో ఆయన రెచ్చ గొట్టిన విద్వేషం గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ తన ట్వీట్ లో....''74 ఏళ్ళ క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు వచ్చారు. కానీ ఇవాళనేమో ప్రస్తుత కేంద్ర హోం మంత్రి తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను విభజించడానికి హైదరాబాద్‌కు వచ్చారు. అందుకే దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు, నిర్ణయాత్మక రాజకీయాలు'' అని అన్నారు కేటీఆర్.
కాగా కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన పలువురు నెటిజనులు బీజేపీ విధానాలపై విరుచుకపడ్డారు. గతంలో తెలంగాణ కు వ్యతిరేకంగా బీజేపీ ముఖ్యనాయకులు మాట్లాడిన మాటల వీడియోలను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ బీజేపీ నాయకులకు తెలంగాణ నాయకులకు ఉన్న చిత్తశుద్ది అర్దమవుతోంది అని వ్యాఖానించారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో
తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు మాత్రమే తెలుసు అన్న కిషన్ రెడ్డి
తెలంగాణ ఉధ్యమాన్ని మట్టికరిపించి దుబ్బాకలో గెలిచాను అన్న రఘునందన్ రావు
దురదృష్టవాశత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని మాట్లాడిన లక్ష్మణ్
తెలంగాణ దగుల్బాజి గాల్ల రాష్ట్రం అని వ్యాఖ్యానించిన బండి సంజయ్ వీడియోలున్నాయి.