పాపకు చెవులు కుట్టిద్దామని వెళ్తుండగా.. ఆరుగురు అక్కడికక్కడే మృతి

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు.

Advertisement
Update:2024-04-25 10:49 IST

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

మృతుల్లో ఓ చిన్నారి...

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ చిన్నారికి చెవులు, ముక్కులు కుట్టించడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

లారీ బ్రేక్‌ డౌన్‌ కావడంతో డ్రైవర్‌ దాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో గమనించకుండా లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు.


మృతుల వివరాలు...

ప్రమాదంలో లాస్య, మాణిక్యం, స్వర్ణ, చందర్ రావు, కృష్టంరాజు, శ్రీకాంత్ చనిపోయారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. వీళ్లది ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం ఎల్‌ గోవిందాపురం. లాస్య చెవులు కుట్టించే కార్యక్రమం కోసం విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

2 రోజుల కిందటే నవ దంపతుల మృతి..

ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లారీలు, ట్రక్కులు రోడ్డు పక్కన ఆపడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News