టీఆరెస్ నేత‌ కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురి అరెస్ట్.. పరారీలో ప్రధాన నిందితుడు

తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. మరో ఆరుగురు నిందితులు రంజన్, గంజిస్వామి, బోధపట్ల శ్రీను, నూకల లింగయ్య, నాగేశ్వర రావు, రంగస్వామిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Update:2022-08-18 11:39 IST

టీఆరెస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఆంధ్రాలో పట్టుకున్న వీరిని ఖమ్మంకు తరలిస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి రంజన్, గంజిస్వామి, బోధపట్ల శ్రీను, నూకల లింగయ్య, నాగేశ్వర రావు, రంగస్వామిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు విడివిడిగా గాలిస్తున్నాయి.


తన తండ్రి ని హత్య చేసినవారి పేర్లను కృష్ణయ్య కుమారుడు నవీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. టీఆరెస్ నేత తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న కృష్ణయ్య హత్య ఖమ్మం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడైన కోటేశ్వరరావుపైనే ప్రధానంగా కృష్ణయ్య కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. ఈ హత్యతో తనకు సంబంధం లేదని తమ్మినేని వీరభద్రం ఇదివరకే స్పష్టం చేశారు.

కృష్ణయ్య హత్య అనంతరం నిందితులు మొదట మహబూబాద్ లోని సీపీఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి షెల్టర్ కోరారని, ఆ తరువాత రాజమండ్రికి వెళ్లారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే అక్కడి నుంచి కూడా వారు విశాఖకు మకాం మార్చినట్టు ఆ తరువాత తెలిసింది. లోగడ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా సీపీఎం మద్దతునిచ్చిన అభ్యర్థిని కృష్ణయ్య భార్య మంగతాయమ్మ ఓడించినప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య వైషమ్యాలు పెరిగినట్టు భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేసి నెగ్గారు. ఖమ్మం జిల్లా తెల్లారపల్లిలో ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది.

Tags:    
Advertisement

Similar News