రూ.1 లక్ష సాయం కోసం 53 వేల దరఖాస్తులు : మంత్రి గంగుల కమలాకర్

కుల వృత్తులకు ఉపయోగపడే ముడి సరుకులు, పరికరాల కొనుగోలుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

Advertisement
Update:2023-06-13 06:52 IST

బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల కుటుంబాలకు రూ.1 లక్ష సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎం కేసీఆర్ మంచిర్యాలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటి వరకు రూ.1 లక్ష సాయం కోసం 53 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కాగా, రూ.1 లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఏప్రిల్ 2021 తర్వాత జారీ అయిన ఆదాయ దృవీకరణ పత్రాన్ని జత చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

కుల వృత్తులకు ఉపయోగపడే ముడి సరుకులు, పరికరాల కొనుగోలుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. దరఖాస్తును మొబైల్‌లో కూడా నింపేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను రూపొందించామని మంత్రి కమలాకర్ చెప్పారు. లబ్దిదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదని.. ఎలాంటి పైరవీలు అవసరం లేదని ఆయన చెప్పారు. దరఖాస్తుదారులకు అవసరమైన దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

ఇక రాష్ట్రంలోని 703 బీసీ ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తి చేసి, ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా ప్రవేశాలు పొందవచ్చని మంత్రి చెప్పారు.  

Tags:    
Advertisement

Similar News