దేశానికి అవసరమైన పత్తి విత్తనాల్లో 50 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి

దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల పంటల విత్తనాలను రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేసింది.

Advertisement
Update:2023-08-14 07:50 IST

తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది. తెలంగాణకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు.. అసంపూర్తిగా వదిలేసిన ఎస్ఆర్ఎస్పీ వరద కాలువతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అనేక సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తయ్యాయి. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నది. దీంతో 9 ఏళ్లలో రాష్ట్ర సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలనుంచి 2.20 ఎకరాలకు పెరిగినట్లు తెలిపింది.

దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటి వరకు రూ.928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల పంటల విత్తనాలను రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో ఎక్కువ శాతం పత్తి విత్తనాలే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తి విత్తనాలు ఎంతో నాణ్యమైనవని సివిల్ సప్లయిస్ శాఖ తెలియజేసింది.

క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గోడౌన్‌ల సామథ్యం 2014-15లో 39.01 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంటే.. ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని వెల్లడించింది. సూక్ష్మ సేద్యం చేసే రైతులకు రూ.2,186.14 కోట్ల సబ్సిడీ అందించామని.. దీంతో 3.10 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందని తెలిపింది. పంట పరిహారం కింద ఇప్పటి వరకు రూ.1,490.15 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని పేర్కొన్నది.

పండించిన ధాన్యాన్ని మొత్తం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ధాన్యం మాత్రమే కాకుండా రూ.11,437.55 కోట్లతో ఇతర పంటలను కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయడంతో పంట ఉత్పత్తులు పెరిగనట్లు వెల్లడించింది.

మిషన్ కాకతీయ పథకం కింద రూ.5,249 కోట్లను ఖర్చు చేసి అనేక గొలుసు కట్టు చెరువులను పునరుద్దరించినట్లు తెలిపింది. దీంతో సాగు విస్తీర్ణం పెరగడమే కాకుండా.. పంట ఉత్పత్తి కూడా పెరిగినట్లు చెప్పింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా.. 2022-23 నాటికి 2.70 కోట్ల టన్నులకు చేరినట్లు ప్రకటించింది.

పత్తి సాగు 2014-15లో 41.83 లక్షల ఎకరాలు ఉండగా.. 2020-21 నాటికి 44.70 శాతం వృద్ధి చెంది.. 60.53 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపింది. 2014-15లో 35.83 లక్షల పత్తి బేళ్లు ఉత్పత్తి కాగా.. 2020-21 నాటికి 63.97 లక్షల బేళ్లకు చేరుకున్నట్లు పౌర సరఫరాలు శాఖ తెలిపింది.

Tags:    
Advertisement

Similar News