ఓట్ల లెక్కింపు కోసం 50 కేంద్రాలు.. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ఈసీ

రాష్ట్రంలో 50 ప్రాంతాల్లో గుర్తించిన కౌంటింగ్ కేంద్రాల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

Advertisement
Update:2023-11-03 07:39 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతుంది. పోలింగ్ ఈ నెల 30న నిర్వహించనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం మరో నెల రోజుల సమయం ఉన్నా.. కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడే లెక్కింపు కేంద్రాలను గుర్తించే పనిలో పడింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించి 50 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే 50 ప్రాంతాల్లోని గుర్తించిన కేంద్రాల జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు పంపారు.

రాష్ట్రంలో 50 ప్రాంతాల్లో గుర్తించిన కౌంటింగ్ కేంద్రాల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. దీంతో ఆయా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలింగ్ తర్వాతే ఒక్కో నియోజవర్గానికి ఎన్ని టేబుల్స్ వేయాలనే విషయాన్ని నిర్ణయించనున్నారు. ఇక లెక్కింపు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే పరిశీలకులను కూడా నియమించనున్నారు.

డిసెంబర్ 3న కౌంటింగ్ సమయంలో ప్రతీ రౌండ్‌లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని పరిశీలకుడి అనుమతి తర్వాతే ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి పరిశీలకులను అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయనున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన వీవీ ప్యాట్లలోని ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రంలోని ఓట్లు, వీవీ ప్యాట్ల లోని ఓట్లు సరిపోలిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించడానికి పరిశీలకుడు అనుమతి ఇస్తారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపైనే కాకుండా, ఓట్ల లెక్కింపుపై కూడా సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు రాష్ట్రానికి 166 మంది పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. 35 సీనియర్ ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా, 67 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా, 60 మంది సీనియర్ ఐఆర్ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా కేటాయించారు.

Tags:    
Advertisement

Similar News