గురుకులాల్లో 4,006 టీజీటీ పోస్టులు.. 75 శాతం మహిళలకే కేటాయిస్తూ సమగ్ర ప్రకటన

బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించింది.

Advertisement
Update:2023-04-28 07:57 IST

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల్లో 75 శాతం మహిళలకే కేటాయించారు. గురుకులాల్లో ఉన్న 4,006 పోస్టులకు గాను 3,012 (అంటే 75 శాతం) పోస్టులు మహిళలకే కేటాయిస్తూ గురువారం సమగ్ర ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. మిగిలిన 994 పోస్టులు జనరల్ అభ్యర్థుల కోటాకు కేటాయించారు. అయితే, వీటిలో కూడా మహిళలకు పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

బాలికలు, మహిళా గురుకులాల్లో ఉండే పోస్టులన్నీ మహిళలతోనే భర్తీ చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించింది. అందువల్లే 75 శాతం పోస్టులు వారికే దక్కేలా ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9,231 పోస్టులకు గాను ఈ నెల 5న ఒకే సారి 9 ఉద్యోగ ప్రకటనలను గురుకుల నియామక బోర్డు జారీ చేసింది. ఇప్పటికే 8 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి సమగ్ర ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. వీటికి సంబంధించి నేటి నుంచి మే 27 సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు.

కాగా, టీజీటీ పోస్టులకు సంబంధించిన సమగ్ర ప్రకటన ఒక్కటే కాస్త ఆలస్యమైంది. తొలుత టీజీటీ కింద 4,020 పోస్టులు ఉంటాయని ప్రకటన జారీ చేశారు. అయితే దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి 14 పోస్టులకు సంబంధించిన సర్వీసు నిబంధనలు రాలేదు. దీంతో వాటిని తప్పించి మిగిలిన 4,006 పోస్టులకు సమగ్ర ప్రకటన ఇచ్చారు. వీటికి కూడా ఈ రోజు నుంచే దరఖాస్తులు తీసుకోనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.1,200 ఉండనున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. రాత పరీక్ష మూడు పేపర్లు, 300 మార్కులకు ఉంటుంది.

గురుకులాల్లో ఉద్యోగాలకు అగస్టులో రాత పరీక్షలు జరిగే అవకాశం ఉంటుంది. మే 27కి అన్ని ఉద్యోగాల దరఖాస్తుకు చివరి రోజు. ఆ తర్వాత రెండు నెలల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకొని.. పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నియామక పరీక్షలన్నీ ఆఫ్‌లైన్ పద్దతిలోనే జరిగే అవకాశం ఉంది. అయితే ఏదైనా పోస్టుకు 30వేలకు మించి దరఖాస్తులు వస్తే మాత్రం ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News