నాలుగేళ్ల బాలుడు.. వీధి కుక్కలకు బలి.. - హైదరాబాద్‌లో విషాదం
తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి చేరుకున్న అతని అక్క పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. అతను వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి.
నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఛే నంబరు చౌరస్తాలోని ఓ కారు సర్వీసు సెంటర్‌లో అతను వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్ (4)లతో కలసి బాగ్ అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివసిస్తున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు ఆటవిడుపుగా ఉంటుందని తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటూ ఉండగా, మరో వాచ్‌మన్‌తో కలసి పనిమీద మరో ప్రాంతానికి వెళ్లాడు. కాసేపు అక్కడ ఆడుకున్న ప్రదీప్.. అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. భయపడిన బాలుడు వాటిని తప్పించుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని వెంట మరొకటి బాలుడిపై దాడి చేశాయి. ఒక దశలో ఓ కుక్క బాలుడి కాలు, మరో కుక్క బాలుడి చేయి నోటకరుచుకుని చెరో వైపునకు లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి చేరుకున్న అతని అక్క పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. అతను వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే బాలుడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో జరిగిన దారుణం దృశ్యాలు బయటికొచ్చాయి.