ఘర్‌ వాపసీ...బీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు?

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్‌కు వస్తారని గులాబీ నేతలు చెప్తున్నారు.

Advertisement
Update:2024-07-30 20:42 IST

బీఆర్ఎస్‌ ఘర్‌ వాపసీ ఆపరేషన్‌ మొదలు పెట్టిందా..! అవును తాజా రాజకీయ పరిణామాలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేరికతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్‌కు వస్తారని గులాబీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే తెల్లం వెంకట్రావు అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌కు వచ్చి మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలతో చర్చలు జరిపారు. ఐతే అనర్హత వేటు భయంతోనే వీరంతా తిరిగి గులాబీ గూటికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది సభ్యులు గెలవగా..కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో ఆ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మిగిలిన 38 మందిలో 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించింది. ఐతే ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో కొనసాగుతానని ప్రకటించారు. ఐతే పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకోవద్దని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News