హైదరాబాద్‌లో 24 గంటల దుకాణాలు.. అనుమతులు ఇవ్వనున్న కార్మిక శాఖ

జీవోలో స్పష్టత లేకపోవడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లగా.. కార్మిక శాఖ ఆ మేరకు రూ.10వేలు వసూలు చేసి అనుమతులు ఇవ్వొచ్చని పేర్కొన్నది.

Advertisement
Update:2023-05-15 15:36 IST

హైదరాబాద్ నగరంలో నైట్ లైఫ్‌కు ఊతం ఇచ్చేలా 24 గంటల పాటు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. ఇప్పటికే జీవో విడుదలై నెల రోజులు గడిచినా.. నిబంధనలపై స్పష్టత రాకపోవడంతో వ్యాపారులు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసినప్పుడే రూ.10వేలు చెల్లించి 24 గంటల పాటు దుకాణాలు, మాల్స్ ఓపెన్ చేసి ఉంచుకోవడానికి పర్మిషన్ తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ ఫీజును ఏ డిపార్ట్‌మెంట్ వసూలు చేయాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

జీవోలో స్పష్టత లేకపోవడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లగా.. కార్మిక శాఖ ఆ మేరకు రూ.10వేలు వసూలు చేసి అనుమతులు ఇవ్వొచ్చని పేర్కొన్నది. దీంతో మరో రెండు మూడు వారాల్లో 24 గంటల పాటు వ్యాపారాలు తెరిచి ఉంచే ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే, కార్మిక శాఖ ఫీజు వసూలు చేసినా.. పోలీస్ వెరిఫికేష‌న్‌ అనంతరం మాత్రమే సదరు దుకాణం, మాల్‌కు పూర్తి స్థాయి అనుమతులు లభించనున్నాయి. ఇప్పటికే అధికారులు ఇలాంటి జీవోలు అమలులో ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎలా పని చేస్తుందో ఆరా తీశారు.

తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1988, హైదరాబాద్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1957‌లో పొందుపరిచినట్లు రెస్టారెంట్లు, మెస్‌లు, రెసిడెన్షియల్ హోటల్స్, లాడ్జింగ్స్, థియేటర్లు, పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, ప్రభుత్వం గుర్తించిన కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు, సాధారణ వ్యాపారం చేసే దుకాణాలు, దుకాణాల సముదాయాలు, కోఆపరేటీవ్ సొసైటీ కార్యాలయాలు, గోడౌన్, వేర్‌హౌస్, స్టోర్ రూమ్స్ వంటివి రాత్రి పూట కూడా తెరిచి వ్యాపారం చేసుకోవడానికి వీలుంటుంది.

ఇక బార్లు, పబ్‌లు, వైన్ షాపులు ఈ యాక్ట్ కిందకు రావు. ఆ వ్యాపారాలు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి.. వాటికి కార్మిక శాఖ జీవోతో సంబంధం ఉండదు. అందుకే వాటిని 24 గంటల పాటు ఓపెన్ చేసి ఉంచడానికి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు.

ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో 24 గంటల పాటు దుకాణాలు, వినోద కేంద్రాలు తెరిచి ఉంటున్నాయి. ఆయా నగరాల్లో నైట్ లైఫ్‌ను ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రి 12 తర్వాత అన్ని రకాల వ్యాపారాలు మూసేస్తున్నారు. ఇక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి సరైన వసతులు లేకుండా పోయాయి. దీన్ని కొంత మంది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడంతో సదరు జీవో జారీ చేసింది. మరో రెండు మూడు వారాల్లో హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు దుకాణాలు తెరిచి ఉండే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News