రోజుకు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చెయ్యాలి
15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి : సింగరేణి సీఎం బలరామ్
వర్షాలు తగ్గడంతో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రోజు 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు అంతే మొత్తంలో బొగ్గు రవాణా చేయాలన్నారు. ఓపెన్ కాస్టుల్లో రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ (మట్టి) తొలగించాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ఓసీపీల్లో పెద్ద ఎత్తున నీటి నిల్వలు ఉన్నాయని.. వాటి తొలగింపునకు అవసరమైతే అదనపు పంపులు ఏర్పాటు చేయాలన్నారు. నైనీ బొగ్గు బ్లాక్, వీకే ఓపెన్ కాస్ట్, రొంపేడు ఓపెన్ కాస్ట్, గోలెటి ఓపెన్ కాస్ట్ గనులకు అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ మొదటి దశ అనుమతులు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ఆయా గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలను మీట్ అయ్యేందుకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు సత్యనారాయణ రావు, వెంకటేశ్వర రెడ్డి, జీఎంలు ఎస్‌డీఎం సుభాని, రవిప్రసాద్, రవికుమార్, అన్ని ఏరియాలు, కార్పొరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.