హైదరాబాద్ తాగునీటికి 20 టీఎంసీల గోదావరి జలాలు
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి తరలించాలని సీఎం ఆదేశం
గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ఇరిగేషన్, జలమండలి అధికారులతో సమీక్షించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ల నుంచి 20 టీఎంసీల నీటిని తరలించడానికి సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. ఏ రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయమవుతుంది.. నీటి లభ్యత ఎంతమేరకు ఉంటుందనే అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ నాటికి టెండర్లకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో కో ఆర్డినేట్ చేసుకొని ఏయే పనులు చేపట్టాలో నిర్ణయానికి రావాలన్నారు. సమీక్షలో నల్గొండ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు దానకిషోర్, అశోక్ రెడ్డి, ప్రశాంత్ జె పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, హరిరామ్, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వద్దనుకున్న కాళేశ్వరమే దిక్కయ్యింది
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బొందల గడ్డగా మారిందని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూలిపోయాయని ప్రతి వేదికపై విమర్శలు గుప్పించే సీఎం రేవంత్ రెడ్డి.. అదే కాళేశ్వరంపై ఆధారపడి వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడా కాళేశ్వరం పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మూసీకి కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలు తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న కొండపోచమ్మ సాగర్ ను కాదనుకొని మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని ఆదేశించారు. రూ.6 వేల కోట్లతో ఈ పనులకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారు. మల్లన్నసాగర్ నుంచి 10 టీఎంసీలు తరలిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో మల్లన్నసాగర్ తో పాటు కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తరలించే పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు, ఇంజనీర్లకు సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మసాగర్ నిర్మించుకున్నారని ఇటీవల వేములవాడ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఇప్పుడు అదే కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తరలించే ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. తాను ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా కాళేశ్వరం ప్రాజెక్టుపైనే డిపెండ్ అయి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి రేవంత్ ప్రయత్నిస్తుండటంతో ఆయన విమర్శలన్నీ తిరిగి ఆయనకే తాకుతున్నాయనే వాదన ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.