కారులో తిరుగుతూ.. 20 వీధి కుక్కల కాల్చివేత

మహబూబ్‌ నగర్‌ నుంచి క్లూస్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో బృందాన్ని రప్పించి వీధుల్లో కుక్కలపై దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు.

Advertisement
Update:2024-02-17 08:58 IST

వీధి కుక్కలపై కక్షగట్టినట్టు వ్యవహరించారు గుర్తుతెలియని వ్యక్తులు. అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతూ.. కనిపించిన కుక్కలన్నింటినీ తుపాకీతో కాల్చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 కుక్కలు మృతిచెందాయి. మరో నాలుగు తీవ్ర గాయాలపాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పొన్నకల్‌ గ్రామంలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారులో ప్రతి వీధిలో తిరుగుతూ కనిపించిన కుక్కలను నాటు తుపాకీతో కాల్చి హతమార్చారు. శుక్రవారం ఉదయాన్నే ఎక్కడికక్కడ చనిపోయి ఉన్న కుక్కలను చూసి గ్రామస్తుల్లో కలవరం మొదలైంది. వెంటనే అడ్డాకుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు.

అనంతరం మహబూబ్‌ నగర్‌ నుంచి క్లూస్‌ టీం ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో బృందాన్ని రప్పించి వీధుల్లో కుక్కలపై దాడి జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. 12 మగ, 8 ఆడ కుక్కల కళేబరాలను గుర్తించి.. వాటికి గ్రామ సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్ద మండల పశువైద్యాధికారి రాజేశిఖన్నా ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. నమూనాలు సేకరించి హైదరాబాదులోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. గాయపడిన నాలుగు శునకాలకు ఇంజెక్షన్లు ఇచ్చి వైద్యం అందిస్తున్నట్లు పశువైద్యాధికారి తెలిపారు. పొన్నకల్‌ కార్యదర్శి విజయరామరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు భూత్పూరు సీఐ రామకృష్ణ తెలిపారు. ఇంతకీ ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారో.. ఎందుకు ఇదంతా చేశారో.. అధికారులకు, గ్రామస్తులకు అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News