1,500 మంది పోలీసులు ఊళ్లపై పడి రైతులను హింసించారు

రూ.40 లక్షల విలువైన భూమి రూ.10 లక్షలకే ఎట్లా ఇస్తారు : ఎంపీ ఈటల రాజేందర్‌

Advertisement
Update:2024-11-14 18:57 IST

సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ లో ఫార్మా కంపెనీలకు భూ సేకరణ కోసం 1,500 మంది పోలీసులు రాత్రికి రాత్రే నాలుగు గ్రామాలపై రైతులను హింసించారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం బీజేపీ స్టేట్‌ ఆఫీస్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా కంపెనీల పేరుతో లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, పులిచర్ల గ్రామాల పరిధిలోని 1,350 ఎకరాలకు తోడు ఇంకో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్న వారిని కొందరు దళారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రూ.40 లక్షలకు ఎకరం విలువైన భూమిని రూ.10 లక్షలకే ఇవ్వాలని బలవంతం చేస్తే భూమినే నమ్ముకుని బతికే రైతులు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. అయినా రేవంత్‌ రెడ్డి అహంకారంతో కలెక్టర్‌ ను ప్రజాభిప్రాయ సేకరణకు పంపితే ప్రజలు నిరసన తెలిపారని వివరించారు. తమపై దాడి చేయలేదని స్వయంగా కలెక్టర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలనే హింసించడం, ఆయా గ్రామాలను యుద్ధభూమిగా మార్చడం రేవంత్‌ కు మంచిది కాదన్నారు. బాధిత రైతుల వద్దకు వెళ్లేందుకు స్థానిక ఎంపీ డీకే అరుణ ప్రయత్నిస్తే బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారని తెలిపారు. సీఎం సోదరుడు మాత్రం 50 కార్ల కాన్వాయ్‌ తో 300 మందిని వెంట బెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ ప్రజలను బెదిరిస్తున్నాడని తెలిపారు. భూములు ఇవ్వకుంటే జైళ్లలో పెడుతామని ప్రజలను బెదిరించడం ఏమిటని మండిపడ్డారు.

అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి బానిసలుగా వ్యవహరిస్తున్నరని తెలిపారు. గతంలో ముచ్చర్లలో ఫార్మాసిటీ కోసం హెలికాప్టర్లతో సర్వే చేశారని, రైతుల నుంచి కోట్లాది రూపాయల విలువైన 14 వేల ఎకరాల భూమిని సేకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అధికారమదంతో ప్రజల భూములు గుంజుకోవడం, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమన్నారు. కోర్టు తీర్పును అతిక్రమించి ప్రజల ఇండ్లు కూలగొడుతున్నారని తెలిపారు. మూసీ ప్రక్షాళన పేరుతో రూ.వేల కోట్ల దందా చేస్తున్నారని ఆరోపించారు. జీఎంఆర్‌ ఎయిర్ పోర్టు కోసం విలువైన భూములిచ్చిన రైతులు, ప్రజలు ఇప్పుడు దుర్భరమైన జీవితాలు గడుతుపున్నారని తెలిపారు. బాసుల ప్రేమ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకోవడం మంచిదికాదని అధికారులను హెచ్చరిస్తున్నామన్నారు. భూములు తీసుకోవడానికి వస్తే అధికారులను తన్ని తరిమి వేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్రజల భూములను గుంజుకుంటున్నరని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల భూములు లాక్కొని భయానక వాతావరణం సృష్టించాలనుకోవడం మంచిది కాదన్నారు. భూములు గుంజుకోవద్దంటే రైతుల చేతులకు బేడీలు వేసిన పాపం రేవంత్‌ రెడ్డికి తగులుతుందన్నారు. బీజేపీ నుంచి ప్రజలు, రైతులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దిలీప్ ఆచారి, సునీత, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News