జీహెచ్ఎంసీ పరిధిలో 1500 పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి హరీశ్ రావు
ఇప్పటి వరకు బస్తీ దవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా వర్కర్ల పోస్టులను ఈ నెలాఖరు లోపు భర్తీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానల్లో మెరుగైన సేవలు అందించడానికే కొత్త పోస్టులను నింపుతున్నట్లు ఆయన తెలిపారు. నగరవాసుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు ఇకపై ఆదివారాలు దవాఖానాలు పని చేయాస్తాయని.. అందుకు బదులుగా శనివారం సెలవు ఉంటుందని తెలిపారు.
ఇప్పటి వరకు బస్తీ దవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని అసెంబ్లీలో ప్రకటించారు. శాసన సభలో అడిగిన ప్రశ్నలకు పై విధంగా జవాబిచ్చారు. బస్తీ దవాఖానల్లో ఖరీదైన లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. మార్చి నాటికి 134 రకాల పరీక్షలు అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. బస్తీ దవాఖానలకు వచ్చే పేషెంట్లకు.. అవసరమైన 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానల కారణంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల ఔట్ పేషెంట్ విభాగంపై భారం తగ్గిందని పేర్కొన్నారు.
త్వరలో మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం కేటాయించబోతోందని కూడా తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారని.. ఈ మేరకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభమైన విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పలు పోస్టుల భర్తీ ప్రకటనలు వెలువడుతున్నాయి. వైద్యారోగ్య శాఖ పరిధిలోని పోస్టులను మంత్రి హరీశ్ రావు ప్రకటించడానికి రెండు రోజుల ముందే.. విద్యా శాఖలో భారీగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే 10 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ఆమె తెలిపారు. మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్తగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.