రెండో రోజు 140 నామినేషన్లు.. ఆస్తులు ప్రకటించిన పొంగులేటి, పైళ్ల శేఖర్ రెడ్డి
రెండు రోజులు కలిపి మొత్తం 234 నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. రెండో రోజైన శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 140 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరపున భాన్సువాడ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, చేవెళ్ల నుంచి కాలే యాదయ్య, కొల్లాపూర్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ తరపున మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ తరపున గోషామహల్ నుంచి రాజాసింగ్, ఖానాపూర్ నుంచి రమేశ్ రాథోడ్ నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులు కలిపి మొత్తం 234 నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ పత్రాలను సమర్పించే సమయంలో జత చేసిన అఫిడవిట్లలో పలువరు నాయకులు తమ ఆస్తులను ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన ఆస్తులు రూ.433.93 కోట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారిలో అత్యధిక ఆస్తులు ఉన్నది శ్రీనివాసరెడ్డికే కావడం గమనార్హం. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి తన కుటుంబానికి రూ.227.51 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా రూ.112.75 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
దేవరకొండ కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలూ నాయక్ తన ఆస్తులు రూ.28.90 లక్షలుగా ప్రకటించారు. ఇప్పటి వరకు నామినేషన్ వేసిన వారిలో అత్యల్ప ఆస్తులు కలిగి ఉన్నది బాలూ నాయకే కావడం గమనార్హం. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆస్తులు రూ.102.20 కోట్లు, తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి బి.మనోహర్ రెడ్డి ఆస్తులు రూ.66.14 కోట్లు, ఎల్బీనగర్ బీజేపీ అభ్యర్థి సామా రంగారెడ్డి ఆస్తి రూ.34.30 కోట్లుగా, బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ ఆస్తి రూ.27.74 కోట్లుగా, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆస్తి రూ.17.05 కోట్లుగా పేర్కొన్నారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు కొడంగల్‌లో నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే నవంబర్ 8న కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కామారెడ్డికి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే రేవంత్ రెడ్డే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. తొలి రోజే రేవంత్ రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలు కొండంగల్‌లో దాఖలు కావడం గమనార్హం. రేపు మాత్రం ఆయన స్వయంగా నామినేషన్ వేస్తారని తెలిసింది.