ముస్లిం శ్మశానవాటికలకు 125 ఎకరాలు..
ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాల్లో మోడల్ శ్మశానవాటికల నిర్మాణం జరుగుతుంది. ఆ శ్మశానవాటికల్లో ప్రత్యేక నడక మార్గాలు ఉండాలని, అక్కడి కార్యక్రమాలకు ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని వక్ఫ్ బోర్డ్ నేతలకు మంత్రి కేటీఆర్ సూచించారు.
మైనార్టీల కోసం మోడల్ శ్మశానవాటికల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 125 ఎకరాలు కేటాయించింది. గతంలో ఈ కేటాయింపు ఉత్తర్వులు వెలువడగా.. వాటికి సంబంధించిన పత్రాలను తాజాగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కు మంత్రి కేటీఆర్ అందజేశారు. ప్రగతి భవన్ లో తనను కలసిన వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిల్లాఖాన్, వక్ఫ్ బోర్డ్ సీఈవో ఖాజా మొయినుద్దీన్ కు కేటాయింపు పత్రాలు అందజేశారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, బలాల పాల్గొన్నారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యర్థన మేరకు ముస్లిం శ్మశానవాటికల ఏర్పాటుకు 125 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో ఉత్తర్వులు జారీఅయ్యాయి. శ్మశానవాటికల నిర్మాణానికి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల్లో భూములు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా మజీద్ పూర్‌లో 22 ఎకరాలు, ఖానాపూర్ లో 42.22 ఎకరాలు, కొందుర్గు మండలంలో 10 ఎకరాలు కేటాయించగా.. మేడ్చల్ జిల్లా నూతనకల్ లో 35.27 ఎకరాలు, తుర్కపల్లిలో 16.31 ఎకరాలు కేటాయించారు.
మోడల్ శ్మశానవాటికలు..
ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాల్లో మోడల్ శ్మశానవాటికల నిర్మాణం జరుగుతుంది. ఆ శ్మశాన వాటికల్లో ప్రత్యేక నడక మార్గాలు ఉండాలని, అక్కడి కార్యక్రమాలకు ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదని వక్ఫ్ బోర్డ్ నేతలకు మంత్రి కేటీఆర్ సూచించారు. గతంలో ఈ శ్మశాన స్థలాల విషయంలో న్యాయపరమైన వివాదాలు ఉన్నా.. అవన్నీ సమసిపోవడంతో ఆ స్థలాలకు సంబంధించిన పత్రాలను వక్ఫ్ బోర్డ్ కి మంత్రి కేటీఆర్ అందజేశారు.
♦