తెలంగాణలో కొత్తగా 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్..

ఇటీవల ఉచితంగా ఇచ్చే ఔషధాల సంఖ్యను 720 నుంచి 843కి ప్రభుత్వం పెంచింది. ఔషధాల నిల్వకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు రూపొందించారు.

Advertisement
Update:2022-09-26 07:56 IST

తెలంగాణలో కొత్తగా 12 సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.43.20 కోట్ల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది తొలి విడతలో ఆరు స్టోర్లు, వచ్చే ఏడాది మరో ఆరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయి.

ఎందుకీ స్టోర్లు..

సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(CMS). ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత మందుల పంపిణీలో ఇవే కీలకం. ప్రస్తుతం హైదరాబాద్‌కు అనుబంధంగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున CMSలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఇక్కడినుంచే మందులు సరఫరా అవుతాయి. ఇటీవల ఉచితంగా ఇచ్చే ఔషధాల సంఖ్యను 720 నుంచి 843కి ప్రభుత్వం పెంచింది. ఔషధాల నిల్వకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు రూపొందించారు. దీంతో వీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందుల్ని నివారించేందుకు ప్రభుత్వం కొత్తగా 12 CMSలు ఏర్పాటు చేస్తోంది.

ఈ 12 CMSలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత అనేదే ఉండదు. ఏవైనా మందులు అత్యవసరంగా కావాల్సి వస్తే వెంటనే సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. CMSల కోసం శాశ్వత భవనాలు కూడా నిర్మించబోతున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు పూర్తి ఉచితంగా వైద్యం అందాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలన్న సీఎం కేసీఆర్ సూచనతో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటికి వెళ్లిన తర్వాత వేసుకునే మందులు కూడా పూర్తి ఉచితంగా ఇవ్వాలని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీలో జాప్యం ఉండకూడదని, దీనికోసం నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవాలని కూడా చెప్పారాయన. కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఇప్పటి వరకూ ఉండేది. దీన్ని నివారించడానికి ఉచిత మందుల సంఖ్యను పెంచారు. అంతే కాకుండా ప్రతి ఆస్పత్రిలో 3 నెలలకు సరిపడా మందులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. CMSల ద్వారా మందుల రవాణా వేగవంతం అవుతుంది, నిల్వ సమస్య తీరుతుంది. అన్ని ఆస్పత్రుల్లో ఉచిత మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News