100 సీట్లు గ్యారెంటీ.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం : సీఎం కేసీఆర్

70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని, ప్రజలు ప్రస్తుతం వారిని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గవని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-05-17 18:36 IST

తెలంగాణ రాష్ట్రంలో మూడో సారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గ్యారెంటీ అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేటీవ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఐదు నెలలు ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను వివరించాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

ఇప్పటి వరకు మనం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేసుకున్నాము. వీటిని ప్రజలకు వివరిస్తే చాలని సీఎం కేసీఆర్ అన్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కూలంకషంగా వివరించాలని కోరారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టాలని, చెరువు గట్ల మీద రైతులతో కలసి భోజనం చేయాలని చెప్పారు.

గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని, ప్రజలు ప్రస్తుతం వారిని నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లకు తగ్గవని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉన్నందన అందరూ అప్రమత్తంగా ఉండి.. ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అక్టోబర్ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున.. పెండింగ్ పనులు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. వీటిని విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. మంత్రులు ఆయా జిల్లాల్లో ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తారని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పరంగానే కాకుండా.. పార్టీ పరంగా కూడా గ్రామగ్రామాన వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.

ప్రభుత్వ విజయాలను ప్రతీ ఒక్కరికి వివరించాలి..

కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం శతాబ్ద కాలంలో చేయాల్సిన పనులను దశాబ్ద కాలంలోనే చేసిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలను పార్టీ పరంగా కార్యకర్తల ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. దేశంలో ఏ పార్టీ చేయని అద్భుతాలు, విజయాలను ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే బీఆర్ఎస్ సాధించిందని ఆయన చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కేంద్ర మంత్రులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ, పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించినట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ రంగంలో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ కోతలు ఉన్నాయి. కానీ దేశంలోనే తొలి సారిగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి చెప్పారు.

నీటి విషయంలో మన రాష్ట్రం ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని అన్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయని జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చామని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి.. కానీ తెలంగాణలో ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడటం లేదని మంత్రి వివరించారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News