తెలంగాణ బీజేపీకి షాకివ్వబోతున్న 10 మంది నాయకులు.. మూకుమ్మడి రాజీనామాకు రంగం సిద్ధం?

బీజేపీలో ఉన్న 10 మంది మాజీ ఎంపీలు ఇప్పటికే పలు మార్లు రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2023-09-22 08:18 IST

తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే సరైన అభ్యర్థులు లేక, క్షేత్ర స్థాయిలో బలోపేతం కాలేక ఇబ్బందులు పడుతున్న బీజేపీకి.. 10 మంది కీలక నాయకులు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉన్న 10 మంది మాజీ ఎంపీలు గతంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే తాము ఊహించినంత మేర బీజేపీకి బలం లేదని వారు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని వారు అంచనా వేసుకున్నారు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీలో ఉన్న 10 మంది మాజీ ఎంపీలు ఇప్పటికే పలు మార్లు రహస్యంగా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తున్నది. మూకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని, తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలతో కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ 10 మంది మాజీ ఎంపీలకు కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ వస్తే.. ఆ వెంటనే ఒకే సారి పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

అధికార బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కునే సత్తా తెలంగాణలో కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని సదరు బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇదే పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వీరంతా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే బలహీనంగా మారింది. ఒకే సారి 10 మంది పార్టీ నుంచి వెళ్లిపోతే ఒక పెద్ద కుదుపుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

10 మంది నాయకులు ఒకే సారి పార్టీ మారాలని ఆలోచిస్తున్న విషయం బీజేపీ అధిష్టానానికి కూడా తెలిసింది. పార్టీ మారవద్దని వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తున్నది. కానీ వాళ్లు మాత్రం పార్టీ మారడానికే కట్టబడి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ 10 మంది నాయకులు పార్టీలో చేరితో తెలంగాణలో బలోపేతం అవుతామని భావిస్తోంది. గతంలో మంచి ప్రజాదరణ కలిగిన నాయకులే కావడంతో.. వారి రాకకు దాదాపు సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం తొలి విడత టికెట్ల కేటాయింపులో అధిష్టానం బిజీగా ఉన్నది. ఆ అంశం ముగిసిన వెంటనే ఈ 10 మందిపై కాంగ్రెస అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News