తెలంగాణలో 10మంది ఐఏఎస్ లు ఆన్ డ్యూటీ

తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update:2024-04-03 18:26 IST

తెలంగాణలో ప్రస్తుతం సాగునీరు, తాగునీరు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సాగునీరు విడుదల చేయడం లేదని, రైతుల పంటలు ఎండిపోతున్నాయంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కొన్నిరోజులుగా ఆందోళన చేస్తోంది. స్వయంగా కేసీఆర్ క్షేత్ర స్థాయి పర్యటనల తర్వాత హడావిడిగా సాగునీరు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని బీఆర్ఎస్ ఘనతగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు మళ్లీ తాగునీటి వ్యవహారం సంచలనంగా మారింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి నిర్వహణ తెలివి లేదని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో 10మంది ఐఏఎస్ అధికారులకు స్పెషల్ డ్యూటీలు వేసింది ప్రభుత్వం.

తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని వారిని ఆదేశించింది. జులై చివరి వరకు ఈ ప్రత్యేక అధికారులు సెలవు పెట్టకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చేయడం, ఎక్కడా ఎవరికీ ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు మార్గం సుగమం చేయడం వీరి విధి.

సాగు, తాగునీటికి కటకట..

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కొరత ఏర్పడుతోంది. బెంగళూరు ఆల్రడీ ఎండిపోయింది, వాటర్ ట్యాంకులే బెంగళూరు వాసులకు దిక్కయ్యాయి. ఇటు తెలంగాణలో కూడా హైదరాబాద్ లో నల్లానీరు అంతంతమాత్రమే కావడంతో ట్యాంకర్లను తెప్పించుకోవడం నిత్యకృత్యంగా మారింది. ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయని.. తాగు అవసరాలకు మినహా సాగుకు నీటిని ఇవ్వలేమని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. తాజాగా నీటి నిర్వహణ కోసం ఐఏఎస్ లను ప్రత్యేకంగా నియమించారు.

Tags:    
Advertisement

Similar News