కేసీఆర్‌కే మా ఓటు.. కామారెడ్డిలో 10 గ్రామ పంచాయ‌తీల తీర్మానం

పంచాయతీల‌ ప్రతినిధులు ఈ మేరకు తీర్మానం ప్రతులను హైదరాబాదులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందించారు. ఏక‌గ్రీవ తీర్మానాలు చేయ‌డం అద్భుతంగా అనిపిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా క‌విత తెలిపారు.

Advertisement
Update:2023-08-27 08:57 IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు గ‌జ్వేల్‌తో పాటు ఈసారి కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏకంగా సీఎం కేసీఆర్ త‌మ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసేందుకు నిర్ణ‌యించ‌డంపై కామారెడ్డి వాసులంతా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని 10 గ్రామ పంచాయ‌తీల ప్ర‌జ‌లు ఏక‌గ్రీవ తీర్మానం కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. దానికి సంబంధించిన ప‌త్రాల‌ను శ‌నివారం నాడు హైద‌రాబాదులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను క‌లిసి అంద‌జేశారు.

ఇంత‌కీ ఆ తీర్మానం ఏంటంటే.. తాము ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కే ఓటేస్తామ‌ని.. ఈ విధంగా 10 గ్రామ పంచాయ‌తీల ప్ర‌జ‌లు ఏక‌గ్రీవంగా తీర్మానం చేయ‌డం విశేషం. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డి పల్లి, నడిమితండా, వెనకతండా, బోడగుట్టతండా, మైసమ్మచూరు, రాజకన్‌పేట, వడ్డెరగూడెం, గుండితండా, దేవునిపల్లి పంచాయతీల‌ ప్రతినిధులు ఈ మేరకు తీర్మానం ప్రతులను హైదరాబాదులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అందించారు.

కేసీఆర్‌కు ఓటేస్తామ‌ని ఏక‌గ్రీవ తీర్మానాలు చేయ‌డం అద్భుతంగా అనిపిస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా క‌విత తెలిపారు. షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్‌ను కుల, మత, పార్టీలకు అతీతంగా చూస్తారని చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ ప్రజలూ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. సోమవారం కామారెడ్డిలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగే భారీ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని కవిత వెల్ల‌డించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించినట్టు క‌విత పేర్కొన్నారు.

*

Tags:    
Advertisement

Similar News