అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రపంచకప్ జ్వరం!
అమెరికాకు టీ-20 ప్రపంచకప్ జ్వరం సోకింది. అమెరికాలోని భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు ప్రపంచకప్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
అమెరికాకు టీ-20 ప్రపంచకప్ జ్వరం సోకింది. అమెరికాలోని భారత ఉపఖండ దేశాల సంతతి అభిమానులు ప్రపంచకప్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
క్రికెట్ మినహా మిగిలిన క్రీడల్నిప్రోత్సహించే అమెరికాకు క్రికెట్ ను అంటించడంలో అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య ( ఐసీసీ ) ఎట్టకేలకు సఫలమయ్యింది. 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఆతిథ్యదేశాలలో ఒకటిగా నిలిచిన అమెరికాను ప్రస్తుతం ప్రపంచకప్ జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
జూన్ 1 నుంచి టీ-20 ప్రపంచకప్ హంగామా...
అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో 2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ పోటీలను నిర్వహించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదం తెలిపింది.
కరీబియన్ ద్వీపాలలోని ప్రధాన క్రికెట్ వేదికలతో పాటు..అమెరికాలోని ప్రధాన క్రికెట్ స్టేడియాలలో సైతం జూన్ 1 నుంచి 29 వరకూ ప్రపంచకప్ గ్రూపులీగ్ కమ్ నాకౌట్ మ్యాచ్ లు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
గ్రూపుదశ మ్యాచ్ లు ప్రారంభం కావడానికి మరో మూడుమాసాల సమయం ఉండగానే..అమెరికా వేదికగా జరిగే మ్యాచ్ ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
టికెట్ల ధరలు ఒక్కసారిగా చుక్కలంటాయి. నిర్వాహక సంఘానికి మాత్రమే కాదు..ఆన్ లైన్ దళారీ వేదికల నిర్వాహకులకు సైతం ప్రపంచకప్ టికెట్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
హాటు కేకుల్లా భారత గూప్ లీగ్ టికెట్లు....
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ..అమెరికాలోని లాంగ్ ఐలాండ్ కు చెందిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం హోంగ్రౌండ్ గా తన లీగ్ దశ మ్యాచ్ లను ఆడనుంది.
లీగ్ దశలో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, జూన్ 5న ఐర్లాండ్, జూన్ 12న అమెరికాజట్లతో భారత్ తలపడే మ్యాచ్ టికెట్లు ఐసీసీ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే విక్రయమైపోయాయి.
ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే టికెట్లు కొనగోలు చేసినవారు...బ్రోకరింగ్ సంస్థలద్వారా విక్రయానికి ఉంచడం ద్వారా లాభాల పంట పండించుకొంటున్నారు. గ్రూప్ లీగ్ దశలో భారత్ ఆడే మ్యాచ్ ల కనీస టికెట్ ధర 90 డాలర్లు ( 7వేల 445 రూపాయలు)గా ఉంది.
అదే..భారత్- పాకిస్థాన్ జట్లు పోటీపడే మ్యాచ్ టికెట్ ధరను మాత్రం 175 డాలర్లు ( 14వేల 475 రూపాయలు)గా నిర్ణయించి..ఐసీసీ ఇప్పటికే టికెట్ల విక్రయాన్ని పూర్తి చేసింది.
చుక్కలంటిన వీఐపీ బాక్సు టికెట్ల ధరలు...
ఐసీసీ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన ప్రపంచకప్ టికెట్లను స్టబ్ హబ్ లాంటి రీసెల్లింగ్ వేదికల ద్వారా విక్రయానికి ఉంచారు. వీఐపీ బాక్స్ టికెట్ ధర 34వేల 14 వందల 586 రూపాయలకు చేరింది.
అదే..7వేల 445 రూపాయలుగా ఉన్న కనీస టికెట్ ధర రికార్డుస్థాయిలో లక్షా 17వేల 67 రూపాయలకు చేరింది. భారత్- ఐర్లాండ్ జట్ల మధ్య జరిగే గ్రూప్ లీగ్ మ్యాచ్ టికెట్లను 26వేల 599 రూపాయల నుంచి 9 లక్షల 37వేల 378 రూపాయల మధ్య విక్రయించారు.
33 లక్షల ధర పలికిన ప్రీమియం టికెట్ ధర...
న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే భారత్- పాక్ జట్ల మ్యాచ్ టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. భారత ఉపఖండానికి చెందిన ఈ రెండుదేశాల మ్యాచ్ కు మాత్రమే టికెట్ల ధర రికార్డుస్థాయికి చేరడంతో ఐసీసీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రీ-సేల్ మార్కెట్లో మ్యాచ్ టికెట్ల ధర ఆకాశాన్ని అంటింది.
అధికారికంగా కనీస టికెట్ ధరను 6 డాలర్లు ( 497 రూపాయలు), ప్రీమియం టికెట్ల ధరను 400 డాలర్లు ( 33వేల 148 రూపాయలు)గా ఐసీసీ నిర్ణయించింది. అయితే..గతంలోనే ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వ్యక్తులు తమ టికెట్లను రీసేల్ మార్కెట్లో స్టబ్ హబ్, సీట్ గీక్ వేదికల ద్వారా కళ్లు చెదిరే ధరకు విక్రయించారు.
400 డాలర్ల ధర 40వేల డాలర్లకు ( 33 లక్షల రూపాయల) చేరింది.
ఈ టికెట్ల ధరకు ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే 50 వేల డాలర్లు ( 41 లక్షల రూపాయలు) అవుతుందని రీసేల్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సూపర్ బౌల్ వేదికగా ' సూపర్ 'ధర !
న్యూయార్క్ లోని విశ్వవిఖ్యాత సూపర్ బౌల్ స్టేడియం వేదికగా గతంలో జరిగిన ఎన్ బిఏ మ్యాచ్ ల సూపర్ బౌల్-58 టికెట్ ధర 9వేల డాలర్లు, కోర్ట్ సైడ్ సీట్ల ధర 24వేల డాలర్లు మాత్రమే కాగా...ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ టికెట్ ధర 40వేల డాలర్లు పలకడాన్ని సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.
సీట్ గీక్ వేదికగా ఇప్పటికే 1,75, 000 డాలర్లు ( కోటి 40 లక్షల రూపాయల ) విలువైన టికెట్లు విక్రయించినట్లు అమెరికా టుడే వివరించింది.
ఈ మొత్తానికి ఫ్లాట్ ఫామ్ ఫీజును కలుపుకొంటే కోటి 86 లక్షల రూపాయలు అవుతుందని అధికారికంగా ప్రకటించారు.
టికెట్లకు డిమాండ్ అంతాఇంతా కాదు....
అమెరికా వేదికగా జరిగే ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, భారత్- పాక్ జట్ల నడుమ జరిగే మ్యాచ్ టికెట్లు రికార్డుస్థాయి ధర పలుకుతున్నాయని అమెరికా క్రికెట్ సంఘం కార్యనిర్వాహక అధికారి బ్రెట్ జోన్స్ ప్రకటించారు.
న్యూయార్క్ నగర జనాభాలో భారతసంతతి వారు 7 లక్షల 11వేల మంది ఉంటే..పాక్ సంతతి ప్రజలు లక్షమంది వరకూ ఉన్నారని, వీరందరికి ప్రపంచకప్ లో భారత్- పాక్ జట్లు తలపడే మ్యాచ్ అంటే ఎంతో ఆసక్తి ఉందని తెలిపారు.
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు...
లాస్ ఏంజెలిస్ వేదికగా జరిగే 2028 ఒలింపిక్స్ ప్రధాన క్రీడాంశాలలో క్రికెట్ కు సైతం తొలిసారిగా చోటు కల్పించారు. 120 సంవత్సరాల విరామం తరువాత ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం సైతం..అమెరికా క్రీడాభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తిని పెంచింది.
టీ-20, వన్డే ఫార్మాట్లలో సైతం అమెరికా వ్యాప్తంగా లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. అమెరికాలోని ఆసియాసంతతి దేశాల అభిమానులు ఎక్కువగా క్రికెట్ పట్ల ఆసక్తి చూపుతున్నారు.