రెండు ముఖాల ఆసియాకప్ క్రికెట్ టోర్నీ!

ఆసియాఖండదేశాల కోసం నిర్వహించే ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఆరు వన్డే టోర్నీ టైటిల్స్ తో అగ్రగామిగా కొనసాగుతోంది.

Advertisement
Update:2023-08-30 16:27 IST

ఆసియాఖండదేశాల కోసం నిర్వహించే ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఆరు వన్డే టోర్నీ టైటిల్స్ తో అగ్రగామిగా కొనసాగుతోంది.

ఐసీసీ నిర్వహించే టీ-20, వన్డే ఫార్మాట్లలో వేర్వేరు ప్రపంచకప్ లు నిర్వహిస్తూ రావడం మనకు తెలిసిందే. అయితే..ఆసియా కప్ క్రికెట్లో మాత్రం అవసరాలకు అనుగుణంగా ఇటు 50 ఓవర్ల వన్డే..అటు 20 ఓవర్ల టీ-20 ఫార్మాట్లో టోర్నీలు నిర్వహిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది.

2021 టీ-20 ప్రపంచకప్ కు ముందు జరిగిన గత ఆసియాకప్ ను టీ-20 ఫార్మాట్లో నిర్వహిస్తే...ప్రస్తుత 2023 ఆసియాకప్ ను మాత్రం 50 ఓవర్ల వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ప్రస్తుత ఆసియాకప్ ను వన్డే ఫార్మాట్లోనే నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.

1984 నుంచి 2023 వరకూ....

ఆసియా క‌ప్ పోటీలు 1984లో ప్రారంభమయ్యాయి. ఈ చాంపియన్షిప్ లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 17 టోర్నీలు నిర్వహించారు. ఎన్న‌డూ లేని విధంగా 2016 నుంచి ఫార్మాట్లు మారుతూ వస్తున్నాయి. ఎమిరేట్స్ వేదిక‌గా నిరుడు జ‌రిగిన ఆసియా క‌ప్ టీ- 20 ఫార్మాట్‌లో జ‌రిగింది. పాక్ చేతిలో కంగుతిన్న భార‌త జ‌ట్టు టోర్నీ నుంచి నిష్క్ర్రమించింది.

ఆసియా క‌ప్‌ను 2014 వ‌ర‌కు వ‌న్డే ఫార్మాట్‌లోనే నిర్వ‌హించారు. 2016లో తొలిసారి టీ- 20 ఫార్మాట్‌ను ప్ర‌వేశ పెట్టారు. 2018లో మ‌ళ్లీ వ‌న్డే ఫార్మాట్‌లోకి మారింది. అయితే.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 2020లో జ‌ర‌గాల్సిన టోర్నీని 2022కు వాయిదా వేశారు. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఈ టోర్నీని టీ-20 ఫార్మాట్‌లో నిర్వహించారు. మ‌ళ్లీ ఇప్పుడు వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తున్నారు.

ఫార్మాట్ల మార్పు వెనుక ?

ఆసియా క‌ప్ టోర్నీ ఫార్మాట్ల లో తరచూ మార్పులపై 2015లోనే ఆసియా క్రికెట్ మండలి ఓ నిర్ణ‌యం తీసుకుంది. ఆసియా క‌ప్ త‌ర్వాత జ‌రిగే ఐసీసీ ప్రపంచకప్ టోర్నీకి అనుగుణంగా ఫార్మాట్ మార్చాల‌ని నిర్ణ‌యించింది. ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. దానికి అనుగుణంగానే.. ఈసారి ఆసియా క‌ప్‌ను వ‌న్డే ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తున్నారు.

2016లో టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున‌ బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జ‌రిగిన ఆసియాక‌ప్‌ను తొలిసారి టీ-20 ఫార్మాట్‌లో పెట్టారు. 2018లో జరిగిన ఆసియా క‌ప్‌ను మ‌ళ్లీ వ‌న్డే ఫార్మాట్‌లోనే జ‌రిపారు. ఆస్ట్రేలియా వేదిక‌గా గతేడాది జ‌రిగిన టీ-20 ప్ర‌పంచ‌ క‌ప్ ముందు ఆసియాక‌ప్‌ను టీ-20 ఫార్మాట్‌లోనే నిర్వ‌హించారు. ఇక‌పై కూడా ఇదే ప‌ద్ద‌తి కొన‌సాగుతుంది. ఇలా చేయ‌డంతో ఆయా ఫార్మాట్ల‌కు ముందుగానే వివిధజట్లు అలవాటు పడటానికి సన్నద్ధమవడానికి వీలు చిక్కుతుందని ఏసీసీ భావిస్తోంది.

6 వన్డే టైటిల్స్ తో భారత్ జోరు...

1984 నుంచి 2022 వరకూ జరిగిన ఆసియాకప్ టోర్నీలలో అత్యధిక టైటిల్స్ ను గెలుచుకొన్న జట్టుగా భారత్ నిలిచింది. భారత్ నెగ్గిన మొత్తం 7 టైటిల్స్ లో ఆరు వన్డే, ఓ టీ-20 ట్రోఫీ ఉన్నాయి.

భారత్ తర్వాత అత్యధికంగా ఆరు టైటిల్స్ తో శ్రీలంక రెండో స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆసియాకప్ టైటిల్‌ను అందుకున్న మరో దేశం పాకిస్థాన్ మాత్రమే. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేకపోయింది. భారత్ మూడుసార్లు, శ్రీలంక ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచాయి.

6 జట్లతో 2023 ఆసియాకప్....

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే 2023 ఆసియాకప్ ను 50 ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్, శ్రీలంక దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగనున్న 13 మ్యాచ్ ల ఈ టోర్నీని గ్రూప్ లీగ్ కమ్ సూపర్-4 నాకౌట్ గా నిర్వహిస్తున్నారు.

ఆసియా అగ్రశ్రేణిజట్లు భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు ఆఫ్ఘనిస్థాన్ తో పాటు నేపాల్ సైతం బరిలోకి దిగుతోంది. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఈ టోర్నీని సన్నాహకంగా ఆసియా దేశాలు వినియోగించుకొంటున్నాయి.

గ్రూప్ - ఏ లీగ్ లో పాల్గొంటున్న భారతజట్టు తన తొలిమ్యాచ్ ను సెప్టెంబర్ 2న పల్లెకీలీ వేదికగా పాకిస్థాన్ తో ఆడనుంది. సెప్టెంబర్ 5న నేపాల్ తో ఆడటం ద్వారా ఆరుజట్ల లీగ్ ను ముగించనుంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్థాన్ ప్రపంచ నంబర్ వన్ గా ఉంటే...భారత్ మూడోర్యాంక్ లో కొనసాగుతోంది.

Tags:    
Advertisement

Similar News