కంగారూ క్రికెటర్లకు లక్షల డాలర్ల ఎర!.. బిగ్ బాష్ లీగ్ కు ఎమిరేట్స్ ఎసరు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ సంఘం నిర్వహించ తలపెట్టిన ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ 2023 జనవరి 6 నుంచి 12 వరకూ జరుగనుంది. ఈ లీగ్ లో ఆస్ట్రేలియా అగ్రశ్రేణి, అత్యుత్తమ క్రికెటర్లందరూ పాల్గొనాలంటే.. బిగ్ బాష్ లీగ్ కు డుమ్మా కొట్టితీరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Update:2022-08-06 12:02 IST

టీ-20 క్రికెట్ లీగ్ ల్లోనే అత్యంత జనాదరణ పొందుతున్న ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ సంఘం కుంపటి రాజేసింది. 15 మంది ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్ లో పాల్గొనకుండా కోట్ల రూపాయలు ఎరవేస్తోంది. ఇప్పటి వరకూ రాజకీయ, వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితమైన.. హార్స్ ట్రేడింగ్ జాడ్యం చివరకు పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కు, ప్రధానంగా ప్రయివేటు టీ-20 లీగ్ లకూ సోకింది. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు గత కొద్ది సీజన్లుగా బిగ్ బాష్ టీ-20 లీగ్ ను అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ టోర్నీ డిసెంబర్ 13న ప్రారంభమై ఫిబ్రవరి 4న ముగియటం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ సంఘం నిర్వహించ తలపెట్టిన ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ 2023 జనవరి 6 నుంచి 12 వరకూ జరుగనుంది. ఈ లీగ్ లో ఆస్ట్రేలియా అగ్రశ్రేణి, అత్యుత్తమ క్రికెటర్లందరూ పాల్గొనాలంటే.. బిగ్ బాష్ లీగ్ కు డుమ్మా కొట్టితీరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

లక్షల డాలర్ల ఎర.. కోట్ల రూపాయల వల!

బిగ్ బాష్ లీగ్ లో పాల్గొంటూ స్టార్ క్రికెటర్లుగా గుర్తింపు పొందిన 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారంరోజులపాటు నిర్వహించే ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ లో పాల్గొనేలా చేయటం కోసం ఏకంగా 7 లక్షల డాలర్లు కేటాయించింది. బిగ్ బాష్ లీగ్ కు డుమ్మా కొట్టి.. తమ లీగ్ లో పాల్గొంటే ఒక్కో ఆటగాడికి 2 కోట్ల 50 లక్షల రూపాయలు ముట్టచెబుతామంటూ ప్రలోభాల ఎరవేసింది. బిగ్ బాష్ లీగ్ నిర్వహకులు చెల్లిస్తున్న మొత్తం కంటే ఇది ఎన్నోరెట్లు ఎక్కువ.

బీబీఎల్ నిర్భంధం కాదు..

బిగ్ బాష్ లీగ్ నిబంధనల ప్రకారం.. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొని తీరాలన్న రూలేమీ లేదు. తమకు నచ్చినలీగ్ లో, తమకు ఎక్కువ కాంట్రాక్టు మొత్తం లభించే లీగ్ లో పాల్గొనే స్వేచ్ఛ ఉంది. చాలామంది కంగారూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఐపీఎల్ కు ఇస్తున్న ప్రాధాన్యం.. బీబీఎల్ కు ఇవ్వటం లేదు. బీబీఎల్ కోటి లేదా రెండు కోట్లు పారితోషకంగా వస్తుంటే.. ఐపీఎల్ లో పాల్గొనడం ద్వారా 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్నారు. 2014 నుంచి ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బిగ్ బాష్ లీగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. బిగ్ బాష్ లీగ్ లో 2 లక్షల 58వేల డాలర్లు మాత్రమే సగటున చెల్లిస్తున్నారు. యూఏఈ లీగ్ లో దానికి రెట్టింపు మొత్తం చెల్లిస్తామంటూ ఎరవేయటం విశేషం. వారం రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ కోసం.. కొద్దివారాలపాటు జరిగే బిగ్ బాష్ లీగ్ కు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి క్రికెటర్లు అందరూ దూరమయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఎమిరేట్స్ క్రికెట్ లీగ్ ధాటికి బిగ్ బాష్ లీగ్ ఏమాత్రం తట్టుకొంటుందో మరి.

Tags:    
Advertisement

Similar News