తొలి టెస్టులో భారత్ ఘన విజయం.. చివరి రోజు చేతులెత్తేసిన బంగ్లాదేశ్

తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయడమే కాకుండా, ఐదుగురు బంగ్లా బ్యాటర్లను కుల్దీప్ అవుట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Advertisement
Update:2022-12-18 10:46 IST

ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. చివరి రోజు తొలి సెషన్‌లో చేతులెత్తేసి.. 324 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు తొలి టెస్టులో 188 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదట్లో కాస్త తడబడినా పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86) రిషబ్ పంత్ (46), రవిచంద్రన్ అశ్విన్ (58), కుల్దీప్ యాదవ్ (40) రాణించడంతో 404 పరుగులు చేసింది. ఇక బంగ్లా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్ప కూల్చడంతో కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు పూర్తి ఆధిక్యత కనపరిచింది. కేఎల్ రాహుల్ విఫలం అయినా.. శుభ్‌మన్ గిల్ (110), చతేశ్వర్ పుజార (102) సెంచరీల మోత మోగించారు. భారత జట్టు మూడో రోజు 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

513 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా ఎటాకింగ్ ప్రారంభించింది. మూడో రోజు ఆటను 42/0 వద్ద ముగించింది. ఇక నాలుగో రోజు కూడా ఓపెనర్లు నిలకడగా ఆడారు. నజ్ముల్ హొస్సేన్, జకీర్ హసన్ భారత బౌలర్లపై విరుచుకపడ్డారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలసి 124 పరుగులు జోడించారు. అయితే రెండో సెషన్‌లో భారత బౌలర్లు వికెట్లు తీయడంలో సఫలం అయ్యారు. కానీ మరోవైపు తొలి టెస్టు ఆడుతున్న జకీర్ హసన్ మాత్రం నిలకడగా ఆడాడు. తొలి టెస్టులోనే సెంచరీ నమోదు చేశాడు. షకీబుల్ హసన్ కూడా మరో ఎండ్‌లో నిలబడ్డాడు. నాలుగో రోజు బ్యాటింగ్ పరంగా బంగ్లా బ్యాటర్లు పర్వాలేదనిపించారు. చివరకు 272/6 వద్ద నాలుగో రోజు ముగించారు.

బంగ్లా బ్యాటర్ల తీరు చూస్తే చివరి రోజు అంత త్వరగా ఔటవరనే అనిపించింది. కనీసం రెండు సెషన్లు అయినా ఆడతారని అందరూ అంచనా వేశారు. కానీ భారత బౌలర్ల ధాటికి తొలి సెషన్‌లో కేవలం 10 ఓవర్లకే చాపచుట్టేశారు. షకీబుల్ హసన్(84) క్రీజులో గట్టిగానే నిలబడ్డా మెహిదీ హసన్ (13)ను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాక అతను కూడా చేతులెత్తేశాడు. షకీబుల్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఇక టెయిలెండర్లలు తైజుల్ ఇస్తామ్(4), ఎబాదత్ హోస్సెన్ (0) అవుట్ కావడంతో భారత జట్టు 188 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అక్షర్ పటేల్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేయడమే కాకుండా, ఐదుగురు బంగ్లా బ్యాటర్లను కుల్దీప్ అవుట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలవడంతో భారత జట్టు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకున్నది. ఈ మ్యాచ్‌కు ముందు 52.08 విజయాల శాంతో నాలుగో స్థానంలో ఉండగా.. ఇప్పుడు శ్రీలంకను వెనక్కు నెట్టి 55.77 శాతంతో మూడో స్థానానికి చేరుకున్నది. భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన 5 టెస్టుల్లో (ఒకటి బంగ్లాతో, నాలుగు ఆస్ట్రేలియాతో) నాలుగు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాలి.

Tags:    
Advertisement

Similar News