74వ పడిలో ' లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్!

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్, తొలి లిటిల్ మాస్టర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ 74వ పడిలో ప్రవేశించారు.

Advertisement
Update:2023-07-10 15:30 IST

సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్, తొలి లిటిల్ మాస్టర్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ 74వ పడిలో ప్రవేశించారు. అభిమానులు, ప్రముఖులు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్ తొలి సూపర్ ఓపెనర్, భారత మాజీ కెప్టెన్ , దిగ్గజ ఆటగాడు సునీల్ మనోహర్ గవాస్కర్ 74వ పడిలో ప్రవేశించారు. 1971- 1987 మధ్యకాలంలో భారత, ప్రపంచ క్రికెట్ ను ఓపెనర్ గా ఓలలాడించిన సునీల్ గవాస్కర్ ప్రస్తుతం క్రికెట్ వాఖ్యాతగా తన వాడివేడీ కలిగిన కామెంట్రీతో తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

తన 74వ పుట్టినరోజును ముంబైలో వేడుకగా జరుపుకొన్నారు. అభిమానులు, ప్రముఖులు, శ్రేయోభిలాషుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

భారత క్రికెట్ తొలి లిటిల్ మాస్టర్...

భారత క్రికెట్ చరిత్రలో ఎందరు లిటిల్ మాస్టర్లున్నా..తొలి లిటిల్ మాస్టర్ ఘనత సునీల్ గవాస్కర్ కు మాత్రమే దక్కుతుంది. సునీల్ గవాస్కర్ బావ గుండప్ప విశ్వనాథ్ కు సైతం లిటిల్ మాస్టర్ గా పేరుంది.

1970 దశకంలో టెస్టు క్రికెట్లో భారత సూపర్ జోడీగా గవాస్కర్- విశ్వనాథ్ తమ ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించారు. 1971లో భారతజట్టులో లిటిల్ ఓపెనర్ గా అడుగుపెట్టిన గవాస్కర్ ఆ తర్వాత 16 సంవత్సరాలరాలపాటు ఓ వెలుగు వెలిగారు.

టెస్టు క్రికెట్లో ఓపెనర్ స్థానం కోసమే పుట్టిన గవాస్కర్ కు తొలిరోజుల్లో హెల్మెట్ లేకుండానే ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఘనత ఉంది. తన కెరియర్ లో 125 టెస్టులు ఆడి 10వేల 122 పరుగులు సాధించారు.

మొత్తం 34 శతకాలతో 51.12 సగటు నమోదు చేశారు. 108 వన్డేలలో 3 వేల 92 పరుగులు, 35.13 సగటు సైతం సాధించారు. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో భారత్ ప్రపంచకప్ సాధించినజట్టులో గవాస్కర్ ఓ కీలక ఆటగాడిగా ఉన్నారు. అత్యధిక క్యాచ్ లు అందుకొని భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించారు.

పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు..

భారత క్రికెట్ కు చిరస్మరణీయమైన సేవలు అందించిన సునీల్ గవాస్కర్ ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన కెరియర్ లో సాధించిన ఐదు అపురూపమైన రికార్డులను ఓసారి గుర్తు చేసుకొందాం..

ఇంటర్ యూనివర్శిటీ క్రికెట్ టోర్నీ ద్వారా భారత సెలెక్టర్ల దృష్టిలో పడిన గవాస్కర్ 1971 కరీబియన్ టూర్ కు ఎంపికైన తర్వాత నుంచి మరి వెనుదిరిగి చూసింది లేదు. ఆ క్రమంలో పలు అసాధారణ ఘనతలు సాధించారు.

10వేల పరుగుల తొలి క్రికెటర్ ...

14 దశాబ్దాల టెస్టు క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్ సునీల్ గవాస్కర్ మాత్రమే. 1987 మార్చి 7న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన టెస్టు ద్వారా 10వేల పరుగుల మైలురాయిని గవాస్కర్ చేరుకోగలిగారు.

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల వరుసలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్ ల తర్వాతి స్థానంలో గవాస్కర్ నిలిచారు. 1982 వరకూ సర్ డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న అత్యధిక టెస్టు శతకాల రికార్డును 1983లో గవాస్కర్ అధిగమిస్తే.. 2005లో గవాస్కర్ పేరుతో ఉన్న 34 శతకాల రికార్డును సచిన్ టెండుల్కర్ తెరమరుగు చేశాడు.

అరంగేట్రం సిరీస్ లోనే 774 పరుగుల రికార్డు...

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరంగేట్రం సిరీస్ లోనే 774 పరుగులు సాధించడం ద్వారా గవాస్కర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కరీబియన్ ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లపైన..అరివీరభయంకర వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని గవాస్కర్ పరుగుల మోత మోగించాడు. మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్ లో 4 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 774 పరుగులు సాధించాడు. ఓ భారత ఓపెనర్ తన అరంగేట్రం టెస్టు సిరీస్ లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు.

ఓపెనర్ గా వచ్చి నాటౌట్ గా......

ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగి తనజట్టు ఇన్నింగ్స్ ముగిసే వరకూ 107 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచిన భారత క్రికెటర్ రికార్డు సైతం గవాస్కర్ పేరుతోనే ఉంది. 1987 సిరీస్ లో భాగంగా ఫైసలాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో గవాస్కర్ ఈ ఫీట్ ను నమోదు చేశాడు. గవాస్కర్ తర్వాత ఇదే ఘనత సాధించిన భారత దిగ్గజ బ్యాటర్లలో రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, చతేశ్వర్ పూజారా సైతం ఉన్నారు. వెస్టిండీస్ ప్రత్యర్థిగా అత్యధిక శతకాల రికార్డు.. మైకేల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్, కోలిన్ క్రాఫ్ట్, యాండీ రాబర్ట్స్, హోల్డర్, కీత్ బాయిస్, వెయిన్ డేనియల్ లాంటి పలువురు కరీబియన్ ఫాస్ట్ బౌలర్లతో కూడిన వెస్టిండీస్ ప్రత్యర్థిగా 27 టెస్టుల్లో 13 సెంచరీలు సాధించిన ఘనత కేవలం గవాస్కర్ కు మాత్రమే సొంతం.

ఒకేజట్టు ప్రత్యర్థిగా అత్యధిక శతకాలు సాధించిన ఇద్దరు దిగ్గజ బ్యాటర్లలో బ్రాడ్మన్ సరసన గవాస్కర్ నిలిచారు. రెండు ఇన్నింగ్స్ లోనూ మూడుసార్లు సెంచరీలు..

ఒకేటెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలను మూడుసార్లు సాధించిన భారత, ప్రపంచ మేటి ఓపెనర్ సునీల్ గవాస్కర్ మాత్రమే. అంతేకాదు..టెస్టు క్రికెట్లో 100 క్యాచ్ లు పట్టిన భారత తొలి క్రికెటర్ గా సునీల్ గవాస్కర్ రికార్డుల్లో చేరారు.

Tags:    
Advertisement

Similar News