భారత జోడీకి ప్రపంచ రెండోర్యాంక్, పాతాళంలో సింధు!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల ర్యాంకింగ్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ లో భారతజోడీ సాత్విక్ -చిరాగ్ అత్యుత్తమంగా రెండోర్యాంక్ లో నిలిచారు.

Advertisement
Update:2023-07-25 13:45 IST

భారత జోడీకి ప్రపంచ రెండోర్యాంక్, పాతాళంలో సింధు!

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల ర్యాంకింగ్స్ లో భారత్ కు మిశ్రమఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల డబుల్స్ లో భారతజోడీ సాత్విక్ -చిరాగ్ అత్యుత్తమంగా రెండోర్యాంక్ లో నిలిచారు......

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల ర్యాంకింగ్స్ లో భారత క్రీడాకారులు కళకళలాడుతుంటే..మహిళల ర్యాంకింగ్స్ లో మాత్రం వెలవెలబోతున్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల డబుల్స్ లో భారత యువజోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి తమ కెరియర్ లోనే అత్యుత్తమంగా 2వ ర్యాంక్ సాధించారు.

భారత తొలిజోడీగా సాత్విక్- చిరాగ్...

బ్యాడ్మింటన్ డబుల్స్ చరిత్రలోనే అత్యుత్తమంగా రెండోర్యాంక్ సాధించిన భారత తొలి, ఏకైకజోడీగా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్లి చరిత్ర సృష్టించారు. 2023 కొరియన్ ఓపెన్ సూపర్-500 టైటిల్ నెగ్గడం ద్వారా నాలుగోర్యాంక్ నుంచి రెండోర్యాంక్ కు చేరుకోగలిగారు.

ఇప్పటి వరకూ రెండోర్యాంక్ లో కొనసాగుతూ వచ్చిన చైనాజోడీ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ లను మూడోస్థానానికి నెట్టడం ద్వారా తమ ర్యాంక్ ను మెరుగుపరచుకోగలిగారు.

ప్రస్తుత 2023సీజన్లో ఇప్పటి వరకూ నాలుగు టైటిల్స్ గెలుచుకోడంతో పాటు..గత 10 డబుల్స్ మ్యాచ్ ల్లోనూ సాత్విక్- చిరాగ్ ల జోడీ అజేయంగా నిలవడం ద్వారా ఈ ఘనత సంపాదించింది.

గత కొద్దిమాసాలుగా ఆసియన్ బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్ తో పాటు స్విస్ ఓపెన్, ఇండోనీసియన్ ఓపెన్, కొరియన్ ఓపెన్ టైటిల్స్ ను సైతం భారతజోడీ గెలుచుకోడం ద్వారా తమ ర్యాంకింగ్స్ పాయింట్లను 87,211కు పెంచుకోగలిగారు.

17వ ర్యాంక్ కు పడిపోయిన సింధు...

రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్, భారత టాప్ స్టార్ పీవీ సింధు ర్యాంకు రానురాను దిగజారిపోతూ వస్తోంది. గత కొద్దిసంవత్సరాలుగా ప్రపంచ టాప్ -6 ర్యాంకుల్లో కొనసాగుతూ వచ్చిన సింధు..అనూహ్యంగా 17వ ర్యాంక్ కు దిగజారిపోయింది.

ప్రస్తుత సీజన్లో ఆడిన ప్రతిటోర్నీలోనూ సింధు పరాజయాలు చవిచూస్తు వస్తోంది. కొరియన్ ఓపెన్ ప్రారంభ రౌండ్లలోనే ఓటమి పొందడం సింధు ర్యాంకింగ్ ను మరింతగా దిగజారేలా చేసింది.

37వ ర్యాంక్ లో సైనా నెహ్వాల్...

లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత సైనా నెహ్వాల్ ర్యాంకింగ్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రస్తుతం 37వ ర్యాంక్ లో కొట్టిమిట్టాడుతోంది. ప్రస్తుత సీజన్ టోర్నీలలో సైనా నామమాత్రంగానే పాల్గొంటూ వస్తోంది. తొలిరౌండ్ పరాజయాలతో పాతాళానికి పడిపోయింది.

కాగా పురుషుల సింగిల్స్ లో భారత స్టార్ ప్లేయర్ ప్రణయ్ 10వ ర్యాంక్ ను నిలుపుకొన్నాడు. డెన్మార్క్ ఆటగాడు విక్టర్ యాక్సెల్ సన్ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్నాడు.

భారత యువఆటగాడు, కెనడా ఓపెన్ విన్నర్ లక్ష్యసేన్ ఓ ర్యాంకు తగ్గి 13వ స్థానానికి పడిపోయాడు. కొరియన్ ఓపెన్ కు దూరంగా ఉండడంతో లక్ష్యసేన్ ఓ స్థానం కోల్పోవాల్సి వచ్చింది.

తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ 20వ ర్యాంక్ కు పడిపోయాడు.

Tags:    
Advertisement

Similar News