జట్కావాలా కుమార్తెకు అరుదైన గౌరవం!

భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్ బరేలీలోని ఓ హాకీ స్టేడియానికి రాణి నామకరణం చేసి గౌరవించారు.

Advertisement
Update:2023-03-30 12:07 IST

భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్ బరేలీలోని ఓ హాకీ స్టేడియానికి రాణి నామకరణం చేసి గౌరవించారు...

భారత హాకీ కెప్టెన్, ఎవర్ గ్రీన్ స్టార్ రాణి రాంపాల్ చరిత్ర సృష్టించింది. గత దశాబ్దకాలంగా భారతహాకీకి రాణి అందించిన సేవలకు గుర్తుగా..రాయ్ బరేలీలో ఓ హాకీ స్టేడియాన్ని నిర్మించారు. భారత హాకీ చరిత్రలోనే ఓ మహిళ పేరుతో హాకీ స్టేడియం నిర్మించడం ఇదే తొలిసారి.

అంచెలంచెలుగా......

హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ జట్కావాలా కుమార్తె రాణి రాంపాల్. 15 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారత హాకీజట్టులో చోటు సంపాదించడమే కాదు..గత దశాబ్దకాలంగా విలక్షణ సేవలు అందించడం ద్వారా భారత మహిళలకే గర్వకారణంగా నిలిచింది.

గతంలోనే ప్రతిష్టాత్మక వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం ద్వారా భారత మహిళా హాకీ ఖ్యాతిని ఎవరెస్టు ఎత్తుకు తీసుకువెళ్లింది.

నిలకడగా రాణించడం ద్వారా...ప్రపంచ మహిళాహాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొంది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు భారతజట్టు అర్హత సాధించడంలో ప్రధానపాత్ర వహించిన రాణికి 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయిలో నిర్వహించిన.. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్

పోలింగ్ లో లక్షా 99వేల 477 ఓట్లు పోలయ్యాయి.మరో 24 మంది క్రీడాకారులతో ఈ అవార్డు కోసం రాణి రాంపాల్ పోటీపడింది. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు

ఈ ఆన్ లైన్ పోలింగ్ లో పాల్గొన్నారు. చివరకు 25 సంవత్సరాల రాణి రాంపాల్ నే అరుదైన ఈ పురస్కారం వరించింది.

నిరుపేద కుటుంబం నుంచి...

ఓ జట్కావాలా కుటుంబంలో జన్మించిన రాణి బాల్యం నుంచి ఎన్నోకష్టాలు, అవమానాలు ఎదుర్కొని 13 సంవత్సరాల చిరుప్రాయంలోనే భారతహాకీలోకి దూసుకొచ్చింది. 15 సంవత్సరాల వయసులోనే..భారతజట్టులో సభ్యురాలిగా ప్రపంచకప్ బరిలో నిలిచింది. ఆ తర్వాత నుంచి భారత మహిళాహాకీకే చిరునామాగా నిలిచింది.

2016 లో అర్జున పురస్కారం అందుకొన్న రాణి నాయకత్వంలోనే భారతజట్టు 2018 ఆసియాక్రీడల హాకీలో రజత పతకం అందుకొంది. భారతజట్టు తరపున 240కి పైగా

అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన రాణి రాంపాల్ కు 130కి పైగా గోల్స్ సాధించిన రికార్డు సైతం ఉంది.

రాణి హాకీ టర్ఫ్ పేరుతో స్టేడియం..

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్మించిన ఎమ్‌సీఎఫ్‌ హాకీ స్టేడియానికి ‘రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ అని పేరు పెట్టారు. ఇటీవలే జరిగిన స్టేడియం నామకరణ కార్యక్రమానికి రాణి ముఖ్య అతిథిగా హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో తన అభిమానులతో రాణి పంచుకుంది. స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా రాణి మాట్లాడుతూ ‘భారత హాకీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. రాయ్‌బరేలీలో హాకీ స్టేడియానికి నా పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్‌ పేరు పెట్టడం, అది గౌరవం తనకే దక్కడం గర్వంగా ఉంది. ఇది చిరస్మరణీయ సందర్భం. ఈ సందర్భాన్ని భారత మహిళల హాకీ జట్టుకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది.

తన పేరుతో నిర్మించిన ఈ స్టేడియాన్ని, తనకు దక్కిన గౌరవం, గుర్తింపులను చూసి..భవిష్యత్‌లో మరింత మంది యువతులు హాకీని కెరీర్‌గా ఎంచుకోవాలి’ అని ట్వీట్‌ చేసింది. ఇదిలా ఉంటే టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత గాయాలతో దూరమైన 28 ఏళ్ల రాణి ఈ మధ్యే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులో చేరింది. ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ ద్వారా పునరాగమనం చేసింది.

భారత క్రీడాప్రాధికార సంస్థలో సహాయ శిక్షకురాలిగా పనిచేస్తున్న రాణి రాంపాల్ కు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇస్తున్నట్లు స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.రాణి రాంపాల్ కు లెవెల్-10 కోచ్ గా ప్రమోషన్ దక్కింది.



Tags:    
Advertisement

Similar News