ఆరేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన కోహ్లీ
విరాట్ కోహ్లీ చివరి సారిగా 2017 ఆగస్టులో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటర్, మంచి ఫీల్డర్ అని అందరికీ తెలుసు. అయితే కోహ్లీ బౌలింగ్ కూడా బాగా చేయగలడని కొంత మందికే అవగాహన ఉన్నది. దేశవాళీ క్రికెట్‌లో బౌలింగ్ చేసిన అనుభవం కూడా ఉన్నది. అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికి వస్తే కోహ్లీ బౌలింగ్ చూడటం చాలా అరుదనే చెప్పాలి. అయితే తాజాగా వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ బౌలర్ అవతారం ఎత్తాడు.
ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్ చేస్తుండగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అప్పటికే 9వ ఓవర్‌లో మూడు బంతులు వేసిన పాండ్యా.. గాయంతో మైదానాన్ని వీడి బయటకు వెళ్లిపోయాడు. దీంతో మిగిలిన మూడు బంతులు వేసే అవకాశాన్ని కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చాడు. మూడు బంతులు మాత్రమే వేసిన కోహ్లీ రెండు పరుగులు ఇచ్చాడు. అంతకు ముందు, ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయిన బంగ్లా బ్యాటర్లు.. కోహ్లీ బౌలింగ్‌లో మాత్రం భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించలేదు.
విరాట్ కోహ్లీ చివరి సారిగా 2017 ఆగస్టులో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. అంటే ఆరేళ్ల తర్వాత కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసినట్లు అయ్యింది. అయితే కోహ్లీ వరల్డ్ కప్‌లో కూడా గతంలో బౌలింగ్ చేశాడు. 2011లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఇక అదే వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంకతో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు. 2015 వరల్డ్ కప్‌లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్ వేసి ఏడు పరుగులు ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే 8 ఏళ్ల తర్వాత కోహ్లీ వరల్డ్ కప్‌లో బౌలింగ్ చేసినట్లు అర్థం అవుతోంది.
♦