ఇంగ్లండ్ దుమ్ము దులిపిన భారత కుర్రాడికి ఐసీసీ అవార్డు!
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ హీరో యశస్వీ జైశ్వాల్ కు 22 ఏళ్ల వయసులోనే ఐసీసీ అవార్డు దక్కింది.
ఇంగ్లండ్ టెస్టు సిరీస్ హీరో యశస్వీ జైశ్వాల్ కు 22 ఏళ్ల వయసులోనే ఐసీసీ అవార్డు దక్కింది. ఈ గౌరవం దక్కించుకొన్న భారత 6వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో అత్యుత్తమంగా రాణించిన భారత యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ పై ప్రశంసల వర్షం మాత్రమే కాదు..అవార్డు వెంట అవార్డులు వచ్చి పడుతున్నాయి.
గత 45 సంవత్సరాలలో ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 700కు పైగా పరుగులు సాధించిన భారత రెండో ఓపెనర్ గా చరిత్ర సృష్టించిన 22 ఏళ్ల యశస్వీ కొద్దిరోజుల క్రితమే ముగిసిన టెస్టు సిరీస్ లో డబుల్ సెంచరీలతో చెలరేగిపోయాడు.
5 టెస్టుల్లో 712 పరుగులు....
ఇంగ్లండ్ ప్రత్యర్థిగా (హైదరాబాద్, విశాఖ, రాజకోట, రాంచీ, ధర్మశాల) జరిగిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని తొమ్మిది ఇన్నింగ్స్ లో యశస్వీ 5 హాఫ్ సెంచరీలు, రెండు ద్విశతకాలతో సహా మొత్తం 712 పరుగులు సాధించడం ద్వారా దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ సరసన చోటు సంపాదించాడు. భారత్ 4-1తో టెస్టు సిరీస్ నెగ్గడంలో ప్రధానపాత్ర వహించిన యశస్వీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సైతం దక్కించుకొన్నాడు.
చిరుప్రాయంలోనే యశస్వీ సాధించిన ఈ రికార్డును గుర్తించిన ఐసీసీ ..2024 ఫిబ్రవరి నెలకు అత్యుత్తమ క్రికట్ అవార్డుకు ఎంపిక చేసింది. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మన్త్ ' అవార్డుకు ఎంపికైన భారత ఆరవ క్రికెటర్ గా యశస్వి రికార్డుల్లో చేరాడు.
2021 జనవరిలో రిషభ్ పంత్, 2021 ఫిబ్రవరిలో రవిచంద్రన్ అశ్విన్, 2021 మార్చిలో భువనేశ్వర్ కుమార్, 2022 ఫిబ్రవరిలో శ్రేయస్ అయ్యర్, 2022 అక్టోబర్ లో విరాట్ కొహ్లీ, 2022 జనవరి, 2023 సెప్టెంబర్ మాసాలలో శుభ్ మన్ గిల్ ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డులకు ఎంపికయ్యారు. ఇప్పుడు తాజాగా యశస్వీ సైతం..పై ఐదుగురు క్రికెటర్ల సరసన నిలువగలిగాడు.
2024 జనవరిలో వెస్టిండీస్ యువఫాస్ట్ బౌలర్ షమార్ జోసెఫ్ ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డు అందుకోగా..2024 ఫిబ్రవరి నెలకు మాత్రం యశస్వీ విజేతగా నిలిచాడు.
భారత క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కీలక సభ్యుడిగా ఉన్న యశస్వీ..2024 టీ-20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మతో కలసి ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.
ఈనెల ఆఖరివారంలో ప్రారంభంకానున్న ఐపీఎల్ -2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్ గా యశస్వీ ఆడనున్నాడు.