టీ-20 విజయాలలో భారత్ ప్రపంచ రికార్డు!

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

Advertisement
Update:2023-12-02 17:16 IST

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్ర్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్ మొదటి నాలుగుమ్యాచ్ లు ముగిసే సమయానికే 3-1తో సిరీస్ ఖాయం చేసుకొంది...

20 ఓవర్లు, 60 థ్రిల్లుగా సాగిపోయే వీరబాదుడు టీ-20 క్రికెట్ ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ టీమ్ భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అత్యధిక విజయాలు సాధించినజట్టుగా నిలిచింది.

ప్రపంచ 4వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లో మూడో విజయం సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొంది.

20 పరుగులతో కంగారూలపై గెలుపు....

2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్నపాంచ్ పటాకా సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ ల్లోనే భారత్ మూడు విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగింది.

ప్రస్తుత సిరీస్ లో భాగంగా విశాఖ, తిరువనంతపురం మ్యాచ్ ల్లో భారత్ నెగ్గి 2-0తో ఆధిక్యం సాధిస్తే..గౌహతీ వేదికగా ముగిసిన మూడో టీ-20లో ఆస్ట్ర్రేలియా విజేతగా నిలిచింది.

రాయ్ పూర్ లోని షాహీద్ వీరనారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలక నాలుగో టీ-20 పోరులో భారత్ 20 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా 3-1తో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది.

రెండుజట్లకూ కీలకంగా మారిన ఈపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 37, రుతురాజ్ గయక్వాడ్ 32 పరుగులకు అవుట్ కాగా...మిడిలార్డర్లో రింకూ సింగ్ 46, జితేశ్ శర్మ 35 పరుగుల స్కోర్లు సాధించడంతో ...ప్రత్యర్థి ఎదుట భారత్ 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.

అక్షర్ పటేల్ స్పిన్ మ్యాజిక్...

వరుసగా రెండోమ్యాచ్ నెగ్గడం ద్వారా 2-2తో సిరీస్ ను సమం చేయాలన్న పట్టుదలతో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 31, కెప్టెన్ మాథ్యూవేడ్ 36, మాథ్యూ షార్ట్ 22 పరుగులు సాధించారు.

భారత బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చహార్ 2 వికెట్లు, రవి బిష్నోయ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

భారత్ 136వ విజయం....

ఆస్ట్ర్రేలియా పై 20 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా భారత్ టీ-20 ఫార్మాట్లో 136వ విజయంతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2006లో టీ-20ల్లో తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన భారత్..ప్రస్తుత సిరీస్ లోని నాలుగో మ్యాచ్ వరకూ 213 టీ-20ల్లో 136 విజయాలు, 67 పరాజయాలు, ఓ టై సాధించడం ద్వారా పాకిస్థాన్ పేరుతో ఇప్పటి వరకూ ఉన్న అత్యధిక విజయాల ప్రపంచ రికార్డును అధిగమించగలిగింది. భారతజట్టు 63.84 విజయశాతాన్ని నమోదు చేయగలిగింది.

పాకిస్థాన్ జట్టు 226 టీ-20ల్లో 135 విజయాలు, న్యూజిలాండ్ 200 మ్యాచ్ ల్లో 102 విజయాలు, ఆస్ట్ర్రేలియా 181 మ్యాచ్ ల్లో 95 విజయాలు, దక్షిణాఫ్రికా 171 మ్యాచ్ ల్లో 95 విజయాల రికార్డులతో ఉన్నాయి.

ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 29 మ్యాచ్ లు ఆడిన భారత్ 18 విజయాలు, 11 పరాజయాల రికార్డుతో ఉంది.

ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి టీ-20 బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరుగనుంది.

Tags:    
Advertisement

Similar News